ఆదివాసీల జీవన విధానమే వేరుగా ఉంటుంది. ఆధునిక సమాజానికి దూరంగా అడవుల్లో, కొండల్లో జీవించే వీరంతా దాదాపుగా స్థానికంగా అడవుల్లో లభించే వాటితోనే తమకు కావాల్సిన వస్తువులు తయారు చేసుకుంటారు. ముఖ్యంగా వీరు వినియోగించే పనిముట్లు అన్ని అడవి నుంచి వచ్చినవే ఉంటాయి. మట్టిపాత్రల్లో వంట చేసుకోవడం, కర్ర బొంగుల్లో ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకోవడం, గడ్డితో పేనిత తాళ్లనే వినియోగంచడం ఇలా చెప్పుకుంటే ఒకటా, రెండా వందల కొద్దీ వస్తువులు ఉంటాయి. కాలక్రమంలో వారి నుంచీ ఈ వస్తువులు మాయమవుతున్నాయి. ప్రతి పల్లెకు, గూడేలకు సైతం ఆధునిక పద్దతులు విస్తరించడంతో చాలా మంది మైదాన ప్రాంతంలో వాడే వస్తువులనే వినియోగిస్తున్నారు. కాలగర్భంలో కలిసిపోతున్న ఈ అరుదైన వస్తువులన్నీ సేకరించి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరలో అద్భుతమైన మ్యూజియం ఏర్పాటు చేసింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ అరుదైన వస్తువులను కన్ను ఆర్పకుండా చూస్తున్నారు.
ఆదివాసి గిరిజనుల జీవనశైలి, వారు వాడిన వస్తువులతో మేడారంలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం ముచ్చటగొలుపుతోంది. ఈ మ్యూజియం గిరిజనుల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. వందల ఏళ్ల క్రితం ఆదివాసీలు వాడిన వస్తువులు, ధరించిన దుస్తులను ఇక్కడ చూడొచ్చు. మేడారం జాతర ప్రాంతంలో 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 2018లో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేశారు.ఆదివాసి గిరిజన మ్యూజియం. గిరిజనుల జీవనం శైలిని ప్రతిబింబించేలా ఈ మ్యూజియం రూపొందించడం విశేషం.ప్రధాన ధ్వారం నుంచి లోపలకి వెళ్లగానే ఆదివాసీల ఆరాధ్యుడు కొమరం భీం విగ్రహం కనిపిస్తుంది. ఆ తర్వా వనదేవతలైన సమ్మక్క, సారక్క జాతర విశేషాలతో కూడిన ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఇంకొంచెం ముందుకు వెళ్లగానే ఆదివాసి గిరిజనుల వందల సంవత్సరాల క్రితం వాడిన వస్తువులు దర్శనమిస్తాయి. వేట కోసం వాడిన విల్లంబులు, బాణాలు, బరిసెలు ఇతర వేట వస్తువులు మనకు కనిపిస్తాయి.
మరోవైపు పండుగ వేళల్లో ధరించే వేషధారణ సంబంధించిన దుస్తులు, డోలు వాయిద్యాలు సైతం మ్యూజియంలో భద్రపరిచారు. అడవిలో దొరికే వివిధ రకాల చెట్లు వాటి వేర్లను సైతం సందర్శకుల కోసం మ్యూజియంలో ఉంచారు. అంతేకాకుండా గిరిజనులు అలంకరణలో ఉపయోగించే చేతి కడియాలు, వడ్డానం కాళ్ళ కడియాలు, తదితర అలంకరణ వస్తువులు ఇక్కడ కనువిందు చేస్తాయి.ఇక మ్యూజియంలోని మొదటి అంతస్తులో పూర్తిగా ఫోటో గ్యాలరీ కోసం ఏర్పాటు చేశారు. గిరిజనుల జీవన శైలికి సంబంధించిన గిరిజనులు వంట చేసుకోవడం, అడవికి వెళ్లడం, పశువులను తీసుకువెళ్లడం, వేట తదితర ఫోటోలు కనిపిస్తాయి. మరోవైపు మేడారం జాతరకు సంబంధించిన వన దేవతల ఫోటోలు గద్దెల వద్ద భక్తుల సందడి తోపాటు ఎడ్లబండ్లపై వచ్చే భక్తుల ఫోటోలు, శివశక్తుల పూనకాలు ఏర్పాటు చేశారు. 1980 కి ముందు ఫోటోలు సైతం కనిపిస్తాయి.
అంతేకాకుండా ఈ మ్యూజియంలో గిరిజనుల జీవనశైలి మేడారం సమ్మక్క సారలమ్మలకు సంబంధించిన చరిత్ర ఆడియో, వీడియో రూపంలో వినిపించడానికి సైతం ఏర్పాటు చేశారు.జాతరకు వచ్చే ప్రతి భక్తులు ఈ మ్యూజియాన్ని సందర్శించి గిరిజనుల జీవన శైలిని ఈ మ్యూజియంలో తెలుసుకుంటున్నారు.జాతరకు వచ్చే ప్రతి భక్తులు ఈ మ్యూజియాన్ని సందర్శించి గిరిజనుల జీవన శైలిని ఈ మ్యూజియంలో తెలుసుకుంటున్నారు.