ap-assembly
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

8 వరకు  అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీలో సోమవారం గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఈ నెల 8 వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 7న (బుధవారం) బడ్జెట్ ప్రవేశపెట్టి.. చివరి రోజు బడ్జెట్ పై చర్చ, పలు బిల్లులను సభలో ప్రవేశ పెట్టనున్నారు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరపనున్నారు. అటు, గవర్నర్ తో ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్పించిందని ఆరోపిస్తూ.. టీడీపీ సభ్యులు బీఏసీ సమావేశాన్ని బహిష్కరించారు. అంతకు ముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
టీడీపీ వాకౌట్
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అబద్ధాలు వినలేకపోతున్నామంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభను బహిష్కరించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తారు. జగనన్న విద్యా దీవెన కింద పూర్తి రీయింబర్స్ మెంట్ ఇచ్చామని గవర్నర్ తెలపగా.. అంతా అబద్ధం అంటూ నినాదాలు చేశారు. ‘మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ’ అని, రైతులను ప్రభుత్వం మోసం చేసిందని, అంగన్వాడీలకు అన్యాయం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీని బహిష్కరించిన టీడీపీ సభ్యులు అసెంబ్లీ లాబీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లే దారిలో బైఠాయించే ప్రయత్నం చేయగా.. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. దీనిపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.