రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. రామచంద్రపురం పురపాలక పరిధిలోని చాకలిపేట మున్సిపల్ హైస్కూల్‌ను మంత్రి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో నాడు–నేడు పనులను పరిశీలించారు. విద్యాకానుక కిట్ల పంపిణీపై ఆరా తీశారు. జగనన్న గోరుముద్ద పథకం అమలు తెలుసుకునేందుకు స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. నాణ్యతైన ఆహారం అందిస్తున్నారని సిబ్బందిని అభినందించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రోడ్ల దుస్థితికి నాటి టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు. నాణ్యతకు తిలోదకాలిచ్చిన రోడ్ల నిర్మాణాలు మూడేళ్లు తిరగకుండా ధ్వంసమయ్యాయన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.5 వేల కోట్లతో రోడ్ల మరమ్మతులు చేయాలని ఆదేశించారన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ గాధంÔð ట్టి శ్రీదేవి, వైస్ చైర్మన్‌లు కోలమూరి శివాజీ, చింతపల్లి నాగేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిల్ విప్ వాడ్రేవు సాయిప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు గుబ్బల గణ, పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్ తదితరులున్నారు.