జనసేనకు పట్టున్న ప్రాంతంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కీలకంగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ముఖ్యంగా కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అయితే జనసేనకు ఉన్న పట్టు మరింత బలీయమైనదనే విశ్లేషకులు చెబుతుంటారు.. ఈనేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే అన్నవరం నుంచే తన వారాహి యాత్రను ప్రారంభించారు.. మొదటి దశలో చేపట్టిన ఈ యాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది కూడా.. వారాహి యాత్రతోపాటు భారీ బహిరంగ సభల ద్వారా పవన్ కల్యాణ్ కేడర్‌లో ఫుల్ జోష్ నింపారు.కాకినాడ సభలో అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ మీద నిప్పులు చెరిగారు పవన్. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చినట్లయ్యింది. అయితే అదే ఊపుతో ఉమ్మడి తూర్పులో జనసైనికులు అంతే ఉత్సాహంగా పార్టీ కోసం పని చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీపై విస్తృతంగా విమర్శలు గుప్పించారు. ఇది పార్టీని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లిన పరిస్థితి కనిపించింది.
అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల బరిలో నిలుస్తుండడంతో కొందరు తమ టిక్కెట్టును కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది.. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేయబోతోందని సమాచారం అందడంతో తీవ్ర నిరాసలో కూరుకుపోవడమే కాకుండా అవసరమైతే రెబల్‌గానైనా రంగంలోకి దిగాలన్న ఆలోచనలో కొందరు ఉన్నారన్న సమాచారం ఇటీవల గణతంత్ర దినోత్సవం రోజున జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం స్థానికంగా కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజవకర్గం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నుంచి జనసేన అభ్యర్ధులు పోటీ చేస్తారని ప్రకటించడం అక్కడి టీడీపీ అభ్యర్ధుల్లో గుబులు రేపగా టీడీపీ అభ్యర్ధులు పోటీ చేసే చోట అవసరమైతే రెబల్‌గా రంగంలోకి దిగుతామని జనసేనకు చెందిన మరికొందరు నాయకులు తమ అనుచరుల వద్ద చెప్పుకోవడం అక్కడ పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధుల్లో గుబులు రేగుతోందట.
ఏదిఏమైనా టీడీపీ అభ్యర్థులకు టిక్కెట్టు కేటాయించినా, జనసేన అభ్యర్ధులకు టిక్కెట్టు కేటాయించినా చివరకు టీడీపీ అభ్యర్థులకే గుబులు రేగుతోందట.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు, రామచంద్రపురం నియోజకవర్గాలలో జనసేన అభ్యర్ధులు పోటీ చేస్తారన్న సమాచారం బాగా ప్రచారం జరుగుతోంది. మరోపక్క పి.గన్నవరం అమలాపురం నియోజకవర్గాలు కూడా జనసేన ఖాతాల్లోకి వెళ్లబోతున్నాయన్న ప్రచారం రెండు రోజులుగా జరుగుతోంది. అయితే ఒకే జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలు జనసేనకు ఎలా ఇస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాజోలు, పి.గన్నవరం, అమలాపురం మూడు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు స్థానాలు.. రాజోలు, పి.గన్నవరం జనసేనకు కేటాయించినా అమలాపురం మాత్రం టీడీపీకి దక్కనుందని తెలుస్తోంది. ఇక్కడ జనసేన అభ్యర్ధి శెట్టిబత్తుల రాజబాబు ఇప్పటికే ప్రజాసంకల్పయాత్ర పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు.
ఈనేపథ్యంలో తనకు టిక్కెట్టు దక్కకపోతే అవసరమైతే రెబల్‌గా రంగంలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.. ఈవార్త టీడీపీ ఆశావాహుల్లో టెన్షన్ పెట్టిస్తుందట. అయితే ఇదే పరిస్థితి రాజోలు, కాకినాడ రూరల్ తదితర నియోజకవర్గాల్లో కనిపిస్తోంది.