ycp social class
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

సామాజిక వర్గ లెక్కల్లో వైసీపీ

రాజ్యసభ అభ్యర్థుల విషయంలో అధికార వైసీపీ  ఆచితూచి అడుగులు వేసిందా? ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని…అభ్యర్థులను ఎంపిక చేసింది. చివరి నిమిషంలో చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ను తప్పించడం వెనుక ఉన్న కారణాలేంటి ? మేడా రఘునాథ్ రెడ్డిని చివరి నిమిషంలో తెరపైకి తీసుకురావడంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో లెక్కలు ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే…వైసీపీ మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి  పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, రాజంపేట ఎమ్మెల్యే సోదరుడు మేడా రఘునాథ్ రెడ్డి అభ్యర్థిత్వాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి విశేష సేవలందించిన వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది.

వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్‌ రెడ్డికి ఒంగోలు సీటు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. రకరకాల సామాజిక సమీకరణాలు తెరపైకి రావడంతో విక్రాంత్‌ రెడ్డికి ఎంపీ టిక్కెట్‌ ఇవ్వలేకపోయింది వైసీపీ. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపుతోంది. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఆయన్ను చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా తప్పించేసింది. వైసీపీ హైకమాండ్‌ తన వ్యూహాన్ని మార్చి.. ఆరణి శ్రీనివాసులు స్థానంలో మేడా రఘునాధ రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చింది. మేడా రఘునాధ రెడ్డి పేరు తెర మీదకు రావడంలో ఆసక్తికరమైన సమీకరణాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు ఉమ్మారెడ్డి వెంకట రమణకు గుంటూరు లోక్‌సభ స్థానం కేటాయించింది. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడికి ఆరణి శ్రీనివాసులు వియ్యంకుడు. దీంతో అరణి శ్రీనివాసులును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులు కంటే.. ఉమ్మారెడ్డి తనయుడికి టిక్కెట్‌ ఇస్తే కాపు సామాజికవర్గం ఓట్లు పడతాయనే లెక్కలు వేసుకుంది. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి వైసీపీ అధిష్ఠానం టికెట్ నిరాకరించింది.

ఆయన స్థానంలో అమర్ నాథ్ రెడ్డికి టికెట్ కేటాయించింది. మల్లిఖార్జున రెడ్డి  కుటుంబం నుంచి రాజ్యసభకు పంపాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. దీంతో మేడా రఘునాధ రెడ్డికి అవకాశం దక్కిందనేది ప్రచారం జరుగుతోంది. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరనే అంతా భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని.. మరొకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని సీఎం జగన్‌ ఎంపిక చేశారు. ఇప్పుడీ ఈక్వేషన్‌పై వైసీపీ వర్గాల్లోనే కాకుండా.. ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీసీ సామాజిక వర్గం నుంచి ఆర్ కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణరావు, బీదా మస్తాన్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో బీసీలకు రాజ్యసభలో పార్టీ వైపు నుంచి ప్రాతినిధ్యం ఉండడంతో…ఈ సారి ఆ సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే మేడా రఘునాధ రెడ్డికి అవకాశం దక్కిందనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.