ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ…ఏపీలో పొలిటికల్ సీజన్ షురూ అయింది. దీనికి తోడు పొలిటికల్ టచ్ ఉన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతుండడంతో ఏపీకి ఎన్నికల ఫీవర్ మరింత పెరిగిపోయింది. యాత్ర-2 సినిమా రిలీజ్ అయింది. ఇక రేపోమాపో వ్యూహం మూవీ కూడా థియేటర్లలోకి రానుంది. దీంతో పొలిటికల్ రియల్ ఫైట్‌లో రీల్ ఫైట్స్ కూడా ఆసక్తిని రేపుతున్నాయి.
పొలిటికల్ కథా చిత్రమ్.. థియేటర్‌లో ఈల.. బయట అభిమానుల గోల..యస్.! ఏపీలో ఇప్పుడు పొలిటికల్ సినిమా సీజన్ నడుస్తోంది. అటు ఎన్నికల వేడి…ఇటు థియేటర్లలో ఆ వేడిని మరింత పెంచేస్తున్న పొలిటికల్ టచ్ ఉన్న సినిమాలు. తాజాగా యాత్ర-2 సినిమా ఏపీలోని సినిమా హాళ్లలో సందడి చేస్తోంది. వైఎస్ మరణం తర్వాత, జగన్ సీఎం అయ్యేదాకా సాగిన ఆయన రాజకీయ ప్రస్థానంపై సినిమా కథ సాగుతుంది.ఏపీ రియల్ రాజకీయాలతో రాజుకున్న ఎలక్షన్ ఫీవర్‌ని ఈ రీల్ ఫైట్స్ మరింత పెంచేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఇక రాజమండ్రిలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్, ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్, వైసీపీ లీడర్లు, కేడర్…ఈ సినిమాను థియేటర్‌లో చూశారు. యాత్ర- 2 సినిమా విడుదల సందర్భంగా థియేటర్ దగ్గర వైసీపీ నేతలు టపాసులు పేల్చారు. వైఎస్ మరణం తర్వాత జగన్ సింగిల్‌గా పోరాటం చేశారని, ఢిల్లీ పెద్దలను ఎదిరించి గెలిచారన్నారు భరత్. యాత్ర-3 సినిమా కూడా ఉంటుందన్నారు ఆయన.
సత్తెనపల్లిలోని ఓ సినిమా హాల్లో యాత్ర-2 మూవీని చూశారు మంత్రి అంబటి రాంబాబు. అన్ని వర్గాల వారు ఆదరించే విధంగా ఈ సినిమా ఉందన్నారు ఆయన. కర్నూలులో కూడా కేక పుట్టించేలా థియేటర్ల బయట యాత్ర-2 సంబరాలు జరిగాయి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సీఎం జగన్‌కు అభిమానులుగా మారతారన్నారు.మరోవైపు ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాకు కోర్టులో లైన్ క్లియర్ అవడంతో అది ఈ నెల 16న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏపీలో ఎన్నికల సీజన్‌కు పోటీగా పొలిటికల్ మూవీ సీజన్ కూడా నడుస్తోంది. మరోవైపు హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో యాత్ర-2 సినిమా చూస్తున్న జగన్, పవన్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. మా నేత గొప్ప అంటే మా నేత గొప్ప అంటూ రెండు వర్గాలు థియేటర్‌లోనే కొట్టుకున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.