ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి పీక్స్ కు చేరి చాలా కాలమైంది. అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలోనూ ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలపాలన్న తపనతో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ మరో సారి అధికారంలోకి రాకూడదు, ఈ అవినీతి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి తీరాలన్న పట్టుదలతో జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలో పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల బరిలోకి దిగాయి. తాజాగా బీజేపీ కూడా వీరితో కలిసేందుకు రెడీ అయిపోయింది. ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసే పోటీ చేస్తాయన్నది దాదాపుగా ఖరారైపోయింది.అటు అధికార పార్టీ కూడా విజయం కోసం నానా ప్రయత్నాలూ చేస్తోంది. సిట్టింగుల మార్పు అంటూ సొంత పార్టీలోనే అసమ్మతి సెగ రాజేసుకుంది. అసెంబ్లీ అని కూడా చూడకుండా నేతలు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు.
స్వయానా జగనే అసెంబ్లీ వేదికగా సభలో లేని విపక్ష నేతపై విషం చిమ్ముతూ విమర్శలు చేస్తున్నారు.రాష్ట్రంలో ఇంతగా ఎన్నికల సెగ రేగుతున్న నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న ఆసక్తి సహజంగానే అందరిలో ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ నెల చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనున్నదని అంటున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు మార్చి 16న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే రాష్ట్రంలో ఒకే విడతలో ఏప్రిల్ 15న ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, పాతిక లోక్ సభ స్థానాలకూ ఒకే విడతలో ఏప్రిల్ 16న ఎన్నికలు జరగనున్నాయని చెబుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఇందుకోసం సన్నాహాలలో మునిగిపోయింది.
ఎన్నికల సిబ్బందికి మార్చి చివరి వారంలో మొదటి విడత శిక్షణ ఇవ్వనున్నారు. రెండో విడతగా జిల్లాల్లోని దిగువ తరగతి ఉద్యోగ వర్గాలకు ఏప్రిల్ మొదటి వారంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సారి ఎలక్షన్ విధుల కోసం కలెక్టరేట్ వర్గాలు కొత్త సాఫ్ట్ వేర్ ను ఉపయోగించనున్నాయి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా ఎన్నికలు జరుగనున్నాయి. సిబ్బంది ఎపిక్ ఇన్ఫర్మేషన్ ను అత్యంత త్వరగా అందుబాటు లో ఉంచుకోవాలని కలెక్టరేట్ వర్గాలు తెలుపుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటికి భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సారి వికలాంగులు మరియు 80 ఏళ్లు పై బడిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కలిపిచనున్నారు.