bus-train
తెలంగాణ రాజకీయం

మెట్రో తరహాలో బస్సు సీట్లు

మహాలక్ష్మి పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఎన్నికలకు ముందు సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని ఎక్స్ ప్రెస్ బస్సుల వరకే పరిమితం చేశారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంటోంది. మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణాలు సాగిస్తుండటం వల్ల తమకు నిల్చోడానికి స్థలం కూడా ఉండటం లేదని పురుషులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు.కొన్నిచోట్ల పురుషులు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం ఆందోళనలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల ఆర్టీసీ హైదరాబాద్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థుల కోసం ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది అంటే మహాలక్ష్మి పథకం తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. రద్దీ విపరీతంగా పెరగడం వల్ల బస్సులు కిటకిటలాడుతున్నాయి. దీంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఆర్టీసీ వినియోగిస్తున్న బస్సుల్లో చాలావరకు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నవే. పల్లె వెలుగు బస్సుల్లోనూ దాదాపు సగం వరకు అద్దె కు తీసుకున్న వాటినే నడిపిస్తోంది. ఈ క్రమంలో మహాలక్ష్మి వల్ల పెరుగుతున్న నియంత్రించేందుకు మెట్రో రైలులో సీట్ల మాదిరి ఆర్టీసీ బస్సుల్లోనూ సీటింగ్ విధానాన్ని మార్చేస్తోంది. వల్ల మధ్యలో ఎక్కువమంది నిల్చోవచ్చని ఆర్టీసీ భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ బస్సులో 25 మంది కంటే ఎక్కువ ప్రయాణికులు అదనంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని చెబుతోంది. అయితే ఈ సీట్ల మార్పింగ్ ప్రక్రియను ముందుగా హైదరాబాద్ లో చేపట్టి.. ఆ తర్వాత రాష్ట్రం మొత్తం విస్తరిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కాగా, మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో ఆర్టీసీకి ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు 700 కోట్ల దాకా చెల్లించింది. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సి పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది.గతంలో మహిళలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బంది పడేవారని.. ప్రయాణానికి ఖర్చు చేయలేక వాయిదా వేసుకునే వాళ్ళని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.

మహాలక్ష్మి పథకం ఆడవాళ్ళ జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చిందని.. వారు ఇతర ప్రాంతాలకు స్వేచ్ఛగా వెళ్లే అవకాశం కల్పించిందని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. బస్సుల్లో సీట్లు లభించడం లేదని చెప్తున్నారంటే పథకం విజయవంతమైనట్టే కదా అని వారు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ సీట్ల మార్పింగ్ ప్రక్రియ పూర్తయితే మరింత మంది అదనంగా ఆర్టిసి బస్సులో ప్రయాణం చేసే అవకాశం ఉంది.