ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన వెంటనే అక్కడి తాలిబాన్ ముష్కరులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే అఫ్ఘాన్ లోని పలు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. అంతేకాదు, కాందహార్ ను స్వాధీనం చేసుకోవడానికి అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఆఫ్ఘాన్ లో ఉన్న 210 మంది తమ పౌరులను చైనా వెనక్కి తీసుకెళ్లింది. ఆఫ్ఘాన్ లోని అంతర్గత ఘర్షణలపై డ్రాగన్ కంట్రీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తాలిబాన్లు కీలక ప్రకటన చేశారు.
చైనాను ఆఫ్థనిస్థాన్ మిత్ర దేశంగా భావిస్తుందని తాలిబాన్లు అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణంలో చైనా పాత్ర ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. చైనాలోని షిన్ జియాంగ్ ప్రావిన్స్ లోని ఉయ్ ఘర్ వేర్పాటువాదులకు తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. అంతేకాదు, ఉయ్ ఘర్ ముస్లింలను తమ దేశంలోకి అడుగుపెట్టనివ్వబోమని తెలిపారు. ఈ మేరకు తాలిబాన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ ప్రకటన విడుదల చేశారు.