అంతర్జాతీయం

Taliban : 13 మంది హజారాలను చంపిన తాలిబాన్‌ : హక్కుల సంఘం ఆరోపణ

(Taliban) ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్‌ హస్తగతం చేసుకున్నప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హజారాలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. తాలిబాన్ వీరిని లక్ష్యంగా చేసుకోవడమే వీరి భయానికి కారణంగా చెప్పవచ్చు. అయితే, 13 మంది హజారాలను చట్టవిరుద్ధంగా తాలిబాన్‌ చంపినట్లు హక్కుల సంఘం ఆరోపిస్తున్నది. హత్యకు గురైన వారిలో ఎక్కువ మంది ఆఫ్ఘన్ సైనికులు తిరుగుబాటుదారులకు లొంగిపోయారని ప్రముఖ హక్కుల సంఘం మంగళవారం తెలిపింది.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ జరిపిన దర్యాప్తు ప్రకారం, ఆగస్టు 30 న మధ్య ఆఫ్ఘనిస్తాన్‌లోని డేకుండి ప్రావిన్స్‌లోని కహోర్ గ్రామంపైకి దాదాపు 300 మంది తాలిబాన్‌లు దాడి జరిపి ఈ హత్యలకు పాల్పడ్డారు. బాధితుల్లో 11 మంది ఆఫ్ఘన్ జాతీయ భద్రతా దళ సభ్యులు, ఇద్దరు పౌరులు ఉన్నారు. వీరిలో 17 ఏండ్ల వయసున్న బాలిక కూడా ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న రెండు వారాల తర్వాత ఈ హత్యలకు పాల్పడినట్లు తెలుస్తున్నది.

ఆఫ్ఘనిస్తాన్‌లోని 3.6 కోట్ల జనాభాలో హజారాలు 9 శాతంగా ఉంటారని ఒక నివేదిక స్పష్టం చేస్తున్నది. వారు సున్నీ-మెజారిటీ దేశంలో షియా ముస్లింలు అయినందున వారిని తరచుగా లక్ష్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ భయంకరమైన దుర్వినియోగాలకు పాల్పడుతున్నారనే దానికి ఈ హజారాల హత్యలే నిదర్శనమని అమ్నెస్టీ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్మార్డ్ తెలిపారు. దీనిపై కామెంట్‌ చేసేందుకు తాలిబాన్‌ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్‌, బిలాల్‌ కరీమీలు నిరాకరించారు. అయితే, ఎలాంటి హత్యలు జరుగలేదని దైకుండికి తాలిబాన్‌ నియమించిన పోలీసు చీఫ్‌ సాదికుల్లా అబేద్‌ చెప్పారని హక్కుల సంఘాలు వెల్లడించాయి.