tdp-ycp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చిత్తూరులో అంతా తికమక… మకతిక…

వైసీపీలో ఎమ్మెల్యేల అజ్ఞాతం. టిడిపిలో కనిపించని నాయకత్వం. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు ప్రధాన పార్టీల్లో పరిస్థితి. టికెట్ దక్కని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు మౌనం వీడక పోగా, అంతుచిక్కని ఎమ్మెల్యేల అంతరంగం పార్టీ కేడర్ కు అర్థం కాక పోతోంది. భవిష్యత్తు కార్యాచరణకు ఒకరిద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్దం కాగా, టీడీపీలో లీడర్‌షిప్ లేని చోట్ల ఆ పార్టీ తంటాలు పడుతోంది. రెండు పార్టీల తిరకాసు ఇలా ఉంటే జనసేన ఎక్కడ సీన్ లో ఉండాలో తెలియక తికమక పడుతోంది.ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ – టీడీపీకే కాదు జనసేనకు ఇంపార్టెంట్ జిల్లానే. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావడం, బాబుకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి కొనసాగుతుండటంతో పార్టీలకే కాదు నాయకులకు కూడా చిత్తూరు జిల్లా టాప్ ప్రియారిటీ అయ్యింది. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిపోతున్నాయి. 14 అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ టీడీపీ మధ్యనే ఫైట్ ఉండబోతుందట. 2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు మినహా అన్ని సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది.

13 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలను దక్కించుకున్న వైసీపీ ఇప్పుడు జిల్లాలో కుప్పం సహా అన్ని సీట్లు తమవే అంటోందట. కుప్పంలో చంద్రబాబు ఓటమి తప్పదంటోంది అధికార పార్టీ వైసీపీ.ఇక, తెలుగుదేశం పార్టీ కూడా అదే దూకుడును ప్రదర్శిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరులో ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్ చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాపై పట్టు సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక రెండు ప్రధాన పార్టీలోని అగ్రనేతల మాటల యుద్ధం ఇలా కొనసాగుతుంటే టికెట్ల కేటాయింపు రెండు పార్టీల్లోనూ గందరగోళ పరిస్థితులకు కారణం అయ్యింది. వైసీపీలో టికెట్లు దక్కని ఎమ్మెల్యేల అంతరంగం అంతుచిక్కనిదైంది.ఇప్పటి దాకా టికెట్ దక్కని చిత్తూరు, మదనపల్లి, సత్యవేడు, పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యేలు నలుగురి భవితవ్యంపై కేడర్ లో పెద్ద చర్చనే నడుస్తోంది. సత్యవేడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సురేష్‌కు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించినా కినుకు వహించిన ఆదిమూలం పార్టీకి దూరం అయ్యారు. ఇప్పటికే టీడీపీ హై కమాండ్ తో టచ్ లోకి వెళ్ళిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఇక అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సి ఉంది.

మరోవైపు పూతలపట్టు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు పరిస్థితి కూడా ఇదే. ఎమ్మెస్ బాబును తప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ కు అవకాశం కల్పించింది. దీంతో అలక బూనిన ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మంతనాలు సాగిస్తున్నారట.ఇక గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా భవిష్యత్తు కార్యాచరణ ఎంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మదనపల్లి వైసీపీ సమన్వయకర్తగా నిషార్ అహమ్మద్ ను ప్రకటించినప్పటి నుంచి పార్టీకి, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్యే నవాజ్ భాషా దూరంగా ఉన్నారు. మదనపల్లిలో అన్ని పార్టీల్లోనూ లీడర్స్ వెయిటింగ్ లో ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో నవాజ్ బాషా అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది. చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును పక్కన పెట్టి, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి ని చిత్తూరు వైసీపీ సమన్వయకర్తను చేయడంతో శ్రీనివాసులుకు భంగపాటు తప్పలేదు.

దీంతో ఇప్పుడు అరణి శ్రీనివాసులు భవితవ్యం ఏంటన్న చర్చ పార్టీ కేడర్, అనుచరుల మెదళ్లను తొలచి వేస్తోంది.రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఛాన్స్ దక్కకపోవడంతో తీవ్ర సంతృప్తితో ఉన్న చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పార్టీ కేడర్ కు, అనుచరులకు దూరంగా ఉన్నారు. దీంతో చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గా అరణి శ్రీనివాసులు నెక్స్ట్ స్టెప్ అర్థం కాని పరిస్థితి. అయితే అరణి శ్రీనివాసులకు మొండి చేయి చూపడంతో టికెట్ల కేటాయింపులో బలిజలకు అన్యాయం జరిగిందంటూ చిత్తూరులో జిల్లా బలిజ సంఘం నేతల భేటీ కాగా టీడీపీలోనూ పలుచోట్ల ఇదే గందరగోళం నెలకొంది. పొత్తుల విషయంలో స్పష్టత లేకపోవడంతో అభ్యర్థుల ప్రకటన అంశం దోబూచులాడుతోంది.ఇప్పటికే కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఉన్నా బలమైన ప్రతిపక్షంగా పనిచేయని పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఉంది. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో టీడీపీ గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటుంది. ఈ ఎన్నికల్లో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తామంటున్న టీడీపీ పుంగనూరు ఇంచార్జ్ గా చల్లా రామచంద్రారెడ్డిని నియమించింది.

పెద్దిరెడ్డి లాంటి బలమైన నాయకుడికి ధీటైన నాయకత్వం ఇవ్వాలనుకుంటున్న టీడీపీ అక్కడ ఎదిగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు టీడీపీ ఆఫీసును ఏర్పాటు చేసుకునేందుకే ఇబ్బంది పడ్డ ఆపార్టీ రానున్న ఎన్నికల్లో పెద్దిరెడ్డిని ఎలా ఎదుర్కోవాలో వ్యూహాలను రచిస్తోంది. ఎన్నికల నాటికి ఎలాగైనా పెద్దిరెడ్డి హవాను నిలువరించే ప్రయత్నం చేసేందుకు టిడిపి కష్టపడుతోంది.ఇక మదనపల్లిలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా లీడర్ల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పిగా మారింది. టికెట్టును ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉండగా మరోవైపు మిత్రపక్షం జనసేన నుంచి కూడా ఇబ్బంది ఎదురవుతోంది. ఇక తంబళ్లపల్లి టీడీపీలోనూ డైలమా కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నా పార్టీ పట్టు సాధించలేక పోయింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి దూకుడును సమర్ధవంతంగా ఎదుర్కొనే నాయకత్వం టీడీపీకి లేక డీలాపడింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు సమాధానం లేకపోతోంది. మాజీ ఎమ్మెల్యే శంకర్‌కు టికెట్ రాదన్న ప్రచారం కొనసాగుతుండటంతో ఆపార్టీ కేడర్ లో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.

ఇక చిత్తూరులో టీడీపీకి నాయకత్వమే కరువైంది. గత కొన్నేళ్లుగా పార్టీకి ఇన్‌ఛార్జ్ లేకపోవడంతో కేడర్ అయోమయంలో ఉంది. రెండు నెలల్లో ఎన్నికలకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైనా ఇంకా లీడర్‌ను వెతికే పనిలోనే ఉండటం గడ్డు పరిస్థితికి కారణమైందట. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుకు టికెట్ దక్కకపోవడంతో బలిజలంతా ఒక్కటి అవుతున్నట్లు భావిస్తున్న టీడీపీ ఆ సామాజికవర్గం నేత ఎంట్రీ కోసం వేచి చూస్తోంది. మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు ఫ్యామిలీ కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు నగరిలోనూ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఫ్యామిలీ పాలిటిక్స్ టీడీపీకి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే నగరి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న గాలి భాను ప్రకాష్ టీడీపీ అభ్యర్థిగా పోటీ దాదాపు ఖరారు కాగా, తమ్ముడు గాలి జగదీష్ పోరు అన్నకు ప్రాణ సంకటంగా మారింది. అన్నదమ్ముల మధ్య ఫైట్ టీడీపీ హై కమాండ్ కు ఇబ్బందిగా మారిందట.ఇక టెంపుల్ సిటీ తిరుపతిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడంతో అందరూ అభ్యర్థులే అన్నట్లు పరిస్థితి మారింది.

తిరుపతి టీడీపీ టికెట్ ను బలిజలు, బీసీలు ఆశిస్తుండడం ఆశావాహుల జాబితా చాంతాడంత ఉండడంతో గెలుస్తామని అంచనాలు వేసుకుంటున్న టీడీపీ అధిష్టానం అభ్యర్థిగా ఎవరిని పెట్టాలో తెలియక తల పట్టు కుంటోంది. ఇక సత్యవేడు టిడిపి అభ్యర్థిని మార్చే ప్రయత్నంలో ఉంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం ఆ పార్టీకి రాజీనామా చేశాక టీడీపీలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే సత్యవేడు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న హెలెన్ ను కొనసాగిస్తారా లేక ఆదిమూలంకు చాన్స్ ఇస్తారా అన్న దానిపై క్లారిటీ లేకపోతోంది. సర్వేల ఆధారంగా సత్యవేడు టికెట్టు పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో అక్కడ కూడా ఆ పార్టీ కేడర్ కు అగ్నిపరీక్షనే పెడుతోంది.ఇక ఈ రెండు ప్రధాన పార్టీల పరిస్తితి ఇలా ఉంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్న జనసేన తాను సైతం అంటోంది. చిత్తూరు, తిరుపతి, మదనపల్లి లో పోటీకి సై అంటున్న జనసేన ఇప్పటికే సరైన నాయకత్వం లేని కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్న టిడిపికి మిత్ర పక్షం పోరు మరో సమస్యగా మారింది.