సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు షాక్ ఇచ్చారు సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ. రెండు లిక్కర్ కంపెనీల మధ్య ఏర్పడిన వివాదం కేసులో విచారణ జరుగుతున్న సమయంలో ఆయన రెండు విస్కీ బాటిళ్లను తెచ్చి సీజేఐ చైర్ ముందు పెట్టారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పెర్నాడ్ రికార్డ్ కంపెనీ దావా చేసిన కేసులో సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. లండన్ ప్రైడ్ పేరుతో ఇండోర్‌కు చెందిన జేకే ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ మద్యం ఉత్పత్తి చేస్తోందని, ఆ కంపెనీని అడ్డుకోవాలని పెర్నాడ్ రికార్డ్ కంపెనీ సుప్రీంలో పిటీషన్ వేసింది.ఈ నేపథ్యంలో జరిగిన విచారణ సమయంలో.. ముకుల్ రోహత్తీ ఆ రెండు కంపెనీలకు చెందిన మద్యం బాటిళ్లను తెచ్చి సీజే ముందు పెట్టారు. అక్కడ జరిగిన పరిణామాలను చూసి అవాక్కు అయిన బెంచ్ సభ్యులు.. గట్టిగా నవ్వి.. మీతో బాటిళ్లు తీసుకువచ్చారా అని ప్రశ్నించారు.
రెండు కంపెనీల మద్యం సీసాల్లో ఉన్న సమానత్వాన్ని చూపేందుకు ఇలా చేయాల్సి వచ్చిందని రోహత్గీ తెలిపారు.ఈ కేసులో జరిగిన ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన గురించి ఆయన వివరించారు. కేసును విచారించిన ధర్మాసనం.. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సీజే తెలిపారు.