వైసీపీ అనగానే జగన్ తరువాత స్ఫురించే పేరు ఏదైనా ఉందంటే అది సజ్జల మాత్రమే. సకల శాఖల మంత్రిగా, ప్రభుత్వ సలహాదారుగా జగన్ సర్కార్ తీసుకునే ప్రతి అడ్డగోలు నిర్ణయాన్నీ మీడియాకు వివరించడానికి ముందుకు వచ్చే సజ్జల.. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించడంలో, వాటి తప్పొప్పులను బేరీజు వేయడంలో తగుదునమ్మా అని ముందుంటారు. ఆయన వ్యవహారం నీతులు చెప్పడానికే తప్ప ఆచరించడానికి కాదన్నట్లుగా ఉంటుంది. ఏపీ, తెలంగాణలో ఓట్లు ఉన్నవారంతా తెలుగుదేశం సానుభూతి పరులే అటువంటి వారి ఓట్లు తొలగించాలంటూ గొంతు చించుకున్న సజ్జల దొంగ ఓట్ల విషయంలో అందరి కంటే ముందు ఉంటారని ఇప్పుడు సందేహాలకు అతీతంగా తేలిపోయింది. ఆయన ఒక్కడికే కాదు, ఆయన కుటుంబం మొత్తానికి ఏపీలోనే రెండేసి ఓట్లు ఉన్నాయని తేలిపోయింది. దీంతో తాడేపల్లి ప్యాలెస్ సలహాల్రావు దొంగ ఓట్ల విషయంలో రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయారు.
సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి భార్య, అలాగే సజ్జల కుమారుడు, వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం ఇన్ చార్జ్ సజ్జల భార్గవరెడ్డి, ఆయన సతీమణికి పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాలలో ఓట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆధారాలతో సహా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకుడు దూళిపాళ్ల నరేంద్ర ఆధారాలతో సహా బయటపెట్టారు. దీనిపై సజ్జల స్పందన చాలా పేలవంగా, బాధ్యతారహితంగా ఉంది. తనకుటుంబానికి మంగళగిరిలో మాత్రమే ఓటు ఉందని చెబుతూ.. పొన్నూరులో ఓట్లు తొలగించే ఉంటారని దాటవేయడం చూస్తుంటే.. ఆయనకు తెలిసే, ఉద్దేశపూర్వకంగానే రెండు చోట్లా ఓట్లు నమోదు చేయించుకున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. మామూలుగా అయితే రాజకీయ నాయకులు ఇటువంటి ఆరోపణలు వస్తే మీడియా ముందకు వచ్చి ఖండించడమే కాకుండా, ఆ ఆరోపణలు వాస్తవ దూరం అని చెప్పేందుకు ఆధారాలను కూడా బయటపెడతారు. కానీ సజ్జల మాత్రం పొన్నూరులో తన కుటుంబం ఓట్లు తొలగించేశారనడానికి ఎటువంటి ఆధారాలూ బయటపెట్టలేదు.
అంతే కాకుండా.. ప్రస్తుతం తాను ఉంటున్న రెయిన్ ట్రీ కాలనీలో రోడ్డుకు ఒకవైపున ఉన్న రెయిన్‌ట్రీ అపార్టుమెంట్లు పొన్నూరు నియోజకవర్గంలో నూ. మరో వైపు ఉన్న విల్లాలు మంగళగిరి నియోజకవర్గ పరిథిలో ఉన్నాయనీ, ఓట్ల చేరిక సమయంలో రెండు నియోజకవర్గాలలోనూ తన కుటుంబం ఓట్లు నమోదై ఉంటాయనీ వివరణ ఇస్తూ, విషయం తెలియగానే పొన్నూరు నుంచి, ఓట్లు తొలగించాలని గత నెల 31 దరఖాస్తు చేశామనీ, తొలగించేసి ఉంటారనే బావిస్తున్నాననీ వివరణ ఇచ్చుకున్నారు. అయితే దూళిపాళ్ల నరేంద్ర ఇప్పటికీ సజ్జల కుటుంబానికి రెండు నియోజకవర్గాలలోనూ ఓట్లు ఉన్నాయని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. దీంతో రాష్ట్రం లో దొంగ ఓట్ల దందా అంతా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జరుగుతోందన్న విమర్శలకు బలం చేకూరినట్లైంది.