tdp-ycp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

టీడీపీకి క్యూ కడుతున్న  వైసీపీ నేతలు

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అధికార వైకాపా నాయకుల్లో గుబులు మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను పసిగట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సహా సీనియర్ నాయకులు మెల్లమెల్లగా  జగన్ కు ఆయన పార్టీకీ దూరం అవుతున్నారు. తమ దారి తాము చూసుకుంటున్నారు.  ఇప్పటికే వెళ్లిపోయిన వారు పోగా ఇంకా పలువురు తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది. వారిలో కొందరు ఇప్పుడు ఓపెన్ అప్ అవుతున్నారు.  దీంతో రానున్న రోజులలో వైసీపీ నుంచి  వలసల వరద ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అదే సమయంలో  వైసీపీ నుంచి వచ్చే వారిని చేర్చుకునే విషయంలో  తెలుగు దేశంజాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.  కష్ట కాలంలో పార్టీని నమ్ముకుని ఉన్న నాయకుల ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు ప్రధమ ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు.

ఇక విషయానికి వస్తే.. ఏపీలో వైసీపీ పరిస్థితి .. జగన్ తో పాటు సజ్జల, వైవీ, విజయసాయి వంటి వారు తప్ప మిగిలిన అందరూ కూడా చంద్రబాబు తలుపు తెరిస్తే తెలుగుదేశం గూటికి చేరిపోవడానికి రెడీగా ఉన్నారనిపించేలా మారిపోయింది.  ఔను  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయ్యారు.  ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికూడా చంద్రబాబుతో చర్చలు జరిపారు. గత ఎన్నికలకు ముందు… తెలుగుదేశం పార్టీకి హ్యాండిచ్చినట్లే ఇప్పుడు వైసీపీకి హ్యాండివ్వడానికి అదాల ప్రభాకర్ రెడ్డి రెడీ అయిపోయారు. ఇలా  ఒకరు, ఇద్దరు, ముగ్గురని కాదు.. దాదాపు  వైసీపీ ముఖ్య నేతలంతా కళ్లేలు తెంచుకుని వైసీపీ నుంచి బయటపడేందుకు తహతహలాడుతున్నారు. పార్థసారధి , వసంత కృష్ణ ప్రసాద్ ఇలా ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు.   రాజ్యసభ ఎన్నికలు, పొత్తుల విషయంలో అధికారిక ప్రకటన కు సిద్ధమౌతున్న  చంద్రబాబు  అదే సమయంలో చేరికల విషయంలో   ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తున్నారు.

అత్యంత బలమైన అభ్యర్థులు,  గెలుపు గుర్రాలు అయితేనే  అయితేనే ప్రాధాన్యత లేకపోతే లేదు అన్నట్లుగా చంద్రబాబు వ్యాహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.  వేమిరెడ్డి  వైసీపీని వీడడమంటే.. ఆ పార్టీ పనైపోయిందనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వేమిరెడ్డి బాబుతో భేటీ అవ్వడంతో వైసీపీ నుంచి వలసలు అనూహ్య స్థాయిలో వెల్లువెత్తే వరదలా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సిట్టింగుల మార్పు అంటూ సీఎం జగన్ ఇప్పటికే అరడజను జాబితాలు విడుదల చేశారు.  ఆయన విడుదల చేసిన జాబితాలలో జరిగిన మార్పులన్నీ దాదాపుగా   రిజర్వుడు  నియోజకవర్గాలకు సంబంధించినవే ఉన్నాయి. అయితే ఆ ఆరడజను జాబితాలలో మార్పుల ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడలేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.ఇప్పుడు విడుదల కానున్న తదుపరి జాబితాల తరువాత ఇంకెంత మంది సిట్టింగులు, నేతలు జగన్ కు దూరం జరుగుతారన్న దానిపై పార్టీ శ్రేణుల్లోనే విస్తృత చర్చ జరుగుతోంది.  జగన్ టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిపోయిన వారి సంఖ్య భారీగానే ఉందని వైసీపీ వర్గాల నుంచే  తెలుస్తోంది. అలా పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నవారిలో అత్యధికులు తెలుగుదేశంలో చేరేందుకే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో తమకు టిక్కెట్లు లేకపోయినా ఫరవాలేదన్నట్లు వారు భావిస్తున్నారని కూడా అంటున్నారు.  ప్రజలలో ఉండడానికీ, తమ రాజకీయ భవిష్యత్ అంతమైపోకుండా చూసుకోవడానికీ వైసీపీని వీడడం ఒక్కటే మార్గమని వారంతా భావిస్తున్నారని చెబుతున్నారు.  అందుకే చంద్రబాబు నాయుడు కూడా చేరికల విషయంలో స్పష్టమైన క్లారిటీతో వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే   పార్టీని నమ్ముకున్న స్థానిక నాయకుల అనుమతి లేకుండా కొత్త వారిని చేర్చుకోరాదని, రాష్ట్ర,  జిల్లా  స్థాయి నాయకులకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే,  అనేక జిల్లాల్లో వైసీపీ  కీలక నేతలు టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నా, వారికి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించడం లేదని అంటున్నారు