ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80GGC ప్రకారం, ఏదైనా రాజకీయ పార్టీ లేదా ఎలక్టోరల్ ట్రస్ట్‌కు ఇచ్చే విరాళం మొత్తాన్ని పన్ను చెల్లింపుదారు క్లెయిమ్ చేసుకోవచ్చు. టాక్స్ పేయర్లు, పన్ను భారం తగ్గించుకోవడానికి + రాజకీయ పార్టీలపై అభిమానాన్ని చాటుకోవడానికి ఇలాంటి విరాళాలు ఇస్తుంటారు. సాధారణ ప్రజల భాషలో దీనిని ఎన్నికల విరాళం అని పిలుస్తారు. అయితే, ఒక పన్ను చెల్లింపుదారు ఇచ్చిన మొత్తం ఎన్నికల విరాళం, అతని మొత్తం ఆదాయం కంటే తక్కువగా ఉండాలన్నది నిబంధన.రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినట్లు సృష్టించి, పన్నులు ఎగ్గొట్టే వారికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన టాక్స్‌పేయర్లకు ఆదాయ పన్ను విభాగం నోటీసులు జారీ చేసింది. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఈ నోటీసులు పంపింది. పన్ను కట్టకుండా ఎగ్గొట్టడానికే అనామక పార్టీలకు విరాళాలు ఇచ్చినట్లు క్లెయిమ్ చేసుకున్నారా, లేదా ఆ డబ్బును దుర్వినియోగం చేశారా అన్న కోణంలో ఆరా తీస్తోంది.వాస్తవానికి, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A కింద రాజకీయ పార్టీలు నమోదై ఉండాలి. వాటికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉండాలి. అలాంటి రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలను మాత్రమే టాక్స్ పేయర్ క్లెయిమ్ చేసుకోగలడు.
ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 5 వేల నోటీసులను ఆదాయ పన్ను విభాగం పంపింది. మరింత మంది అనుమానిత పన్ను చెల్లింపుదార్లకు కూడా త్వరలో నోటీసులు వెళతాయి. గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చి, వాటిని క్లెయిమ్ చేసుకున్న పన్ను చెల్లింపుదార్లు ఐటీ నోటీస్ అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి.కనీసం 20 రాజకీయ పార్టీలు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ దృష్టిలో ఉన్నాయి. వీటికి విరాళాలు ఇచ్చినట్లు క్లెయిమ్ చేసుకున్న టాక్స్ పేయర్లు లక్షల్లో ఉన్నారు. ఈ రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయ్యాయి కానీ ఎన్నికల సంఘం నుంచి ఇంకా గుర్తింపు పొందలేదు. అంతేకాదు, క్లెయిమ్ చేసుకున్న సందర్భాల్లో, విరాళాలు ఇచ్చిన విధానం పన్ను చెల్లింపుదార్ల ఆదాయంతో సరిపోవడం లేదు. ఇది అనుమానాస్పదంగా మారింది. కొన్ని కేసుల్లో, విరాళం తీసుకున్న పార్టీలు నగదు రూపంలో పన్ను చెల్లింపుదార్లకు ఆ డబ్బును తిరిగి ఇచ్చాయి.
అంటే, విరాళం ఇచ్చినట్లు చూపి క్లెయిమ్ చేసుకుంటున్నారు, మళ్లీ ఆ డబ్బును తిరిగి వెనక్కు తీసుకుంటున్నారు.ఎన్నికల విరాళాల పేరిట పన్ను ఎగవేతకు, మనీలాండరింగ్‌కు పాల్పడిన కేసులు గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి. ఆదాయానికి మించి విరాళాలు ఇవ్వడం లేదా మొత్తం ఆదాయంలో 80 శాతం వరకు విరాళాలుగా చూపిన అనేక ఉదంతాలను ఆదాయ పన్ను విభాగం గుర్తించింది.