తెలంగాణ ముఖ్యాంశాలు

నాతో గోక్కుంటే… అగ్గితో గోక్కున్నట్టే – మోడీకి కేసీఆర్ వార్నింగ్

నాతో గోక్కుంటే… అగ్గితో గోక్కున్నట్టే అని కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ప్రగతి భవన్ లో రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశాన్ని బిజెపి జలగలా పట్టి పీడిస్తోందని కేసీఆర్‌ మండిపడ్డారు. ప్రధాని మోడీ.. అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. టిఆర్ఎస్ లేవనెత్తిన ప్రశ్నలకు జాతీయ కార్యవర్గ భేటీలో ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. చేతగాని కేంద్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా మారుస్తామన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని మోడీ చెప్పినట్టు గుర్తు చేసిన కేసీఆర్.. ఈ విషయంలో ప్రధాని మోడీకి థ్యాంక్స్‌ చెబుతున్నాట్టు తెలిపారు. తెలంగాణ సర్కారు ఇంజిన్‌ స్పీడ్‌గా ఉందని.. కేంద్రంలో కూడా తెలంగాణ సర్కారులా స్పీడ్‌గా ఉన్న ప్రభుత్వం రావాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. మోడీ హయాంలో రూపాయి విలువ భారీగా పతనమవడంతోపాటు నిరుద్యోగం పెరిగిపోయిందని కేసీఆర్ మండిపడ్డారు. ప్రధాని తన తెలివితక్కువ తనంతో దేశాన్ని నాశనం పట్టించారని విమర్శించారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ ఏదో చెబుతాడని ఆశిస్తే అలాంటిదేం జరగలేదని కేసీఆర్ అన్నారు. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ లేని ఆ సమావేశాల్లో ప్రధాని చెప్పింది సున్నా అని విమర్శించారు. సభలో ప్రధాని ఏం మాట్లాడిండో దేవుడికే ఎరుకన్న కేసీఆర్.. తాను అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ప్రధాని సమాధానం చెప్పలేదని అన్నారు. కేంద్ర మంత్రులు సైతం నోటి దూల తీర్చుకుని పోయారే తప్ప దేశ ప్రజల పక్షాన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని డొల్లతనాన్ని రుజువు చేసుకుని పోయారని చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి 8ఏండ్లు గడుస్తున్నా మోడీ దేశానికి చేసిన ఒక్క మంచిపనైనా ఉందా అని కేసీఆర్ ప్రశ్నించారు.

బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో కన్నా కేరళ, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని కేసీఆర్ చెప్పారు. అందుకే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు పోయి బీజేపీయేతర ప్రభుత్వాలు రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మార్చుతామని అన్నారు. బీజేపీ నేతలకు కళ్లు నెత్తికెక్కాయని, దద్దమ్మలు కూడా ఎక్కువ మాట్లాడుతున్నరని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో ఏక్ నాథ్ లు ఎట్లా వస్తారన్న ముఖ్యమంత్రి.. బీజేపీ ఏక్ నాథ్ లను తయారు చేస్తోందా అని నిలదీశారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/