రాజకీయాలంటేనే అవసరాలు.. అవసరాల ఆధారంగానే రాజకీయాలు నడుస్తాయి. రాజకీయ పార్టీలు సేవ చేసే మఠాలు కాదు కాబట్టి.. వారి ప్రయోజనాలకు అనుగుణంగానే అడుగులు వేస్తాయి. ఇందులో ఏ రాజకీయ పార్టీ కూడా సుద్ధ పూస కాదు. అధికారం కోసం పొత్తు పెట్టుకుంటాయి. అదే అధికారం కోసం పొత్తును తెంచుకుంటాయి. విలువలు, వంకాయలు అని వెతకాల్సిన పనిలేదు.. అయితే ఇప్పుడు తెలంగాణ
రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన రాజకీయ పొత్తు చర్చల్లో ఉంది. అది ముడి పడుతుందా? విడిపోతుందా? అనేది పక్కన పెడితే ప్రస్తుతానికైతే ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తాయా? రెండు పార్టీల ఉమ్మడిశత్రువు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే కలయిక తప్పదా? రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నప్పటికీ..ఈ ఎన్నికల్లో వాటిని పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చారా? అంటే దీనికి అవును అనే సమాధానాలు ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్నాయి. ఈ పార్లమెంటు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ కలిసి పోతాయని రెండు రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రచారంపై అటు కారు, ఇటు కమలం పార్టీ నాయకులు స్పందించలేదు. కానీ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బరస్ట్ అయ్యారు. ” భారత రాష్ట్ర సమితితో మెడకాయ మీద తలకాయ ఉన్న వాడెవడైనా పొత్తు పెట్టుకోడు” అని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు కిషన్ రెడ్డి పై ఉన్న అసంతృప్తి వల్లే అని ప్రచారం కూడా జరిగింది. మరోవైపు భారత రాష్ట్ర సమితిని ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏలో తెచ్చుకోబోమని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారని బండి సంజయ్ అంటున్నారు. అయితే బండి సంజయ్ మాటలు విన్న చాలా మంది తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయాలలో ఎప్పటి మాటలు అప్పుడే ఉంటాయి. బండి సంజయ్ భారత రాష్ట్ర సమితి తో గురించి మాట్లాడినప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి మరోరకంగా వ్యాఖ్యానించారు. బండి సంజయ్ వల్ల అయ్యేది, పోయేది ఏదీ లేదన్నారు. ఎటువంటి పొత్తులు లేకపోయినా మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం నుంచి తన కుమారుడు పోటీ చేస్తాడని మల్లారెడ్డి ప్రకటించారు.అంటే మల్లారెడ్డి బిజెపితో పొత్తును ఏమాత్రం ఖండించలేదు.
పైగా పై స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి అనే సంకేతాలు ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి అధిష్టానం నుంచి ఎటువంటి సంకేతం లేకుండా మల్లారెడ్డి అలాంటి మాటలు మాట్లాడారనుకోవడానికి లేదు. మరోవైపు బిజెపితో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని భారత రాష్ట్ర సమితి నాయకులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఢిల్లీ స్థాయిలో పొత్తులకు సంబంధించి చర్చలు నడుస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత సర్వే నివేదికల ఆధారంగా ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బిజెపి అధికారంలోకి వస్తుందని సంకేతాలు విని పిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇవే చివరి ఎన్నికలు కావడంతో ఉన్న 400కు మించి పార్లమెంటు స్థానాలు గెలుచుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇందిరా గాంధీ హయాంలో తప్ప ఇంతవరకు మనదేశంలో ఏ రాజకీయ పార్టీకి ఆ స్థాయిలో పార్లమెంటు స్థానాలు రాలేదు. ఈ ఘనతపై దృష్టి సారించిన నరేంద్ర మోడీ కాంగ్రెస్ మినహా దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ఎన్డీఏలో చేర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఇలాంటి వ్యాఖ్యలను చేశారు. అరవైపు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పరిస్థితి బాగోలేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కీలక నాయకులు మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కొన్ని కొన్ని పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రావడం లేదు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీని నిలువరించాలంటే బిజెపి సపోర్ట్ తీసుకోవాలని కేసిఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఇండియా కూటమి కూడా అంత బలంగా లేనందున బిజెపితో పొత్తు పెట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పొత్తుకు సంబంధించి ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. కారు, కమలం మధ్య ముడిపడేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా వాటినే నిజం చేస్తున్నాయి.