టీడీపీ నేత పీఆర్ మోహన్ హఠాన్మరణం
టీడీపీ నేత, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ ఇవాళ గుండెపోటుతో మరణించారు. పీఆర్ మోహన్ మృతితో టీడీపీ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. పీఆర్ మోహన్ తో ఎంతో అనుబంధం ఉన్న చంద్రబాబు… పార్టీ సహచరుడికి నివాళులు అర్పించేందుకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వెళ్లారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు.
పీఆర్ మోహన్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. పీఆర్ మోహన్ కు తనకు మధ్య ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అందుకే ఆయన కడసారి చూపు కోసం శ్రీకాళహస్తి వెళ్లానని తెలిపారు. మోహన్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పానని వివరించారు.