vizag steel
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

అమ్మకానికి విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు

విశాఖ ఉక్కు పరిశ్రమ భూముల్ని అమ్మేయడానికి ప్రకటన వెలువడింది.  జాతీయ భవన నిర్మాణ కార్పోరేషన్‌ ఎన్‌బీసీసీ, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భూముల అమ్మకం జరుగుతోంది.  స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన రూ.1540 కోట్ల విలువైన భూముల అభివృద్ధి, అమ్మకం కోసం కేంద్ర ప్రభుత్వంతో తాము అవగాహనా ఒప్పందం చేసుకున్నట్లు ఎన్‌బీసీసీ ఇంతకు ముందే ప్రకటన చేసింది. ఆ ప్రకారం ఇప్పుడు అమ్మకానికి రంగం సిద్దం చేసుకుంది. ఈ మేరకు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. వెబ్ సైట్ లో పూర్తి వివరాలను పెట్టింది. వైజాగ్ స్టీల్ వెబ్ సైట్ లోనూ అమ్మకపు వివరాలు ఉన్నాయి. స్టీల్‌ ప్లాంట్‌కు వివిధ ప్రాంతాల్లో వేల ఎకరాల భూములు ఉన్నాయి. నేరుగా ప్లాంట్‌ ఉన్న ప్రాంతంలోనే 6 వేల ఎకరాలకు పైగా దాతలు ఇచ్చిన భూమి ఉంది. దీంతో పాటు ఉద్యోగుల క్వార్టర్స్‌, అనుబంధ భవనాల రూపంలో పలు చోట్ల భూములు ఉన్నాయి. వీటిలో నగరంలోని మద్దెలపాలెం, హెచ్‌బీ కాలనీ, పెదగంట్యాడ  ప్రాంతాలకు చేరువలో 22.19 ఎకరాల భూమి ఉంది.

ఇందులో ప్రస్తుతం ఉద్యోగుల క్వార్ట్రర్స్‌ ఉన్నాయి.  దీని విలువ ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.1540 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భూముల వేలం జరుగుతుంది. విశాఖ నగరంలో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల క్వార్టర్స్‌ భూమిని అభివృద్ధి చేసి తర్వాత విక్రయించేలా  కేంద్ర ప్రభుత్వం- జాతీయ భవన నిర్మాణ కార్పోరేషన్ (ఎన్‌బీసీసీ) మధ్య గత ఏడాది  ఒప్పందం కుదిరింది. కేంద్రం తరఫున స్టీల్‌ ప్లాంట్‌ అధికారులు ఈ ఒప్పందం చేసుకున్నారు.  గతంలో 830 క్వార్టర్లను ఇక్కడ ఉద్యోగుల కోసం నిర్మించారు. అయితే వీటిలో చాలా మటుకు శిధిలం అయ్యాయి. ఇందులో 130 క్వార్టర్లను రిపేర్లు చేయించుకుని ఉద్యోగులు ఉంటున్నారు. వీటిని పూర్తిగా పడగొట్టేసి కమర్షియల్‌ కాంప్లెక్స్‌తో పాటు నివాసాలు కూడా నిర్మించేందుకు ఎన్‌బీసీసీ ఒప్పందం చేసుకుంది. అభివృద్ధి చేసి విక్రయించేది ఎన్‌బీసీసీ అయితే.. స్థలాలను విక్రయించేది నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్.  విశాఖ ఉక్కు కోసం 19,000 ఎకరాల భూములు సేకరించారు.

అందు లో 6,000 ఎకరాలు గ్రీన్‌ బెల్ట్‌ కింద వదిలేశారు. ఇది పోను మిగతా భూమి లో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. దీనికి తోడు మద్దిలపాలెం, గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాల్లో సిబ్బంది నివాసాల కోసం సేకరించిన భూములు పెద్ద మొత్తంలో ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ముడి సరుకు కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో నిధుల కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో స్థలాలు అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు.  స్టీల్‌ ధరలు తగ్గటంతో గత రెండు మూడేళ్లుగా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నష్టాలు చవిచూస్తోంది.   రూ.23,000 కోట్ల అప్పులు, ఇనుప ఖనిజం కోసం సొంత గనులు లేకపోవడం కూడా ఆర్‌ఐఎన్‌ఎల్‌ను కుంగదీస్తోంది. ఇనుప ఖనిజాన్ని ఓపెన్‌ మార్కెట్‌ నుంచి కొనడంతో టన్నుకు రూ.6,000 వరకు భారం పడుతోంది. భూముల అమ్మకం ద్వారా కొంత వరకూ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తన్నారు.