ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు.. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు లైఫ్ అండ్ డెత్‌గా మారాయి. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి నవ్ ఆర్ నెవర్ అన్నట్టు పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే.. నాయకులు ప్రజల్లోకి వస్తున్నారు. సభలు పెడుతున్నారు. విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా కూడా దూషణలకు దిగుతున్నారు. ఇక, తాజాగా కీలక నేతల నోటి నుంచి సినిమా డైలాగులు కూడా వస్తున్నాయి. దీంతో రాజకీయాలు ఎటు పోతున్నాయనే వాదన వినిపిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిర్వహించిన వలంటీర్లకు వందనం కార్యక్రమంలో ముఖ్యమం త్రి( వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సినిమా డైలాగు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునే బాధ్యత యువత, వలంటీర్లపైనే ఉందన్న ఆయన స్లీవ్స్ మడత పెట్టి పోరాటంలోకి దిగిండని వ్యాఖ్యానించారు. దీనిని వేదికపైనే చేసి చూపించారు. అయితే.. దీనికి కొనసాగింపుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి కౌంటర్ వచ్చింది.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మీరు చొక్కలు మడత పెడితే.. ప్రజలు మీ కుర్చీలు మడత పెట్టేందుకు రెడీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇక, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా విజయనగరం జిల్లాలో నిర్వహించిన.. శంఖారావం సభలో ఇదే తరహా డైలాగులు పేల్చారు. “ముఖ్యమంత్రి జగన్.. చొక్కాలు మడత పెట్టాలని అంటున్నారు. మేం ఆయన కుర్చీని మడత పెట్టి ఇంటికి పంపిస్తాం“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించడమే కాదు.. వేదికపైనేఉన్న కుర్చీని మడత పెట్టి చూపించారు. ఇది ఆ పార్టీ నాయకుల్లో సంతోషం కలిగించింది. పార్టీ నాయకులు.. యువతలో ఉన్న ఆవేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసేందుకు సినిమా డైలాగులు చెప్పడం కొత్తకాదు. గతంలో అన్నగారు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా.. సినిమా డైలాగులు రాజకీయ నేతల ప్రచారంలో ఉన్నాయి. కానీ, ఇవి ప్రత్యర్థి వర్గాల మధ్య వివాదాలు, విద్వేషాలు పెంచి పోషించేలా ఎప్పుడూ లేదు. “ఈ నేల నీది.. ఈ ఆత్మగౌరవం నీది.. ఢిల్లీ పెద్దల కాళ్ల ముందు దోసిలొగ్గుతావా!“ అంటూ.. అప్పట్లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగు.. వివాదం కాలేదు.
ఆలోచన దిశగా ఓటర్లనుముందుకు నడిపించింది. ఫలితంగా 1983లో జరిగిన ఎన్నికల్లో ఏకపక్ష విజయం టీడీపీని వరించింది. కానీ, రాను రాను .. సినిమా డైలాగులు రెచ్చగొట్టేలా ఉంటున్నాయనే వాదన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా.. గుంటూరు కారం సినిమాతో తెరమీదకి వచ్చిన `మడత` డైలాగులు.. రాజకీయ పార్టీలు తమ వనరుగా మార్చుకున్నాయి. దీనివల్ల పార్టీల నాయకులు ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల యువత రెచ్చగొట్టుకుని.. విధ్వంసాలకు.. ఘర్షణలకు దిగితే.. ఎవరు బాధ్యులు? అనేది ప్రధాన ప్రశ్న. రాజకీయాల్లో సవాళ్లు , ప్రతిసవాళ్లు మామూలే అయినా.. అవి ఆరోగ్య కరంగా.. అందరూ హర్షించేలా వుండాలి. కానీ, ఇప్పుడు నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధాలు.. ఉద్రేకాన్ని మరింత రెచ్చగొట్టేలా ఉంటుండడం గమనార్హం. రాష్ట్రంలో యువత ఇప్పటికే చీలిపోయింది. ఆలోచనా శక్తిని ప్రేరేపించే రాజకీయాలు లేకపోవడం.. రెచ్చగొట్టే విధంగా నాయకులే వారిని ప్రేరేపిస్తుండడంతో అనేక ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల నాయకులు సమావేశాలు పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందనేది వాస్తవం.
దీనికి ప్రధాన కారణం.. యువతను రెచ్చగొట్టేసేలా.. నాయకులు ప్రసంగాలు దంచికొడుతుండడమే. చెప్పులు చూపించడం.. కాలర్లు మడత పెట్టడం.. దూషణలు, వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, కుటుంబాలను.. బయటకు లాగడం వంటివి ఇప్పటికే యువతను తప్పుదోవ పట్టించాయని రాజకీయ పార్టీల సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. “కనుమూరి బాపిరాజునేను ప్రత్యర్థులం. కానీ, అది ఎన్నికల వరకే. తర్వాత.. మేం.. మేం.. మిత్రులం. మా ఇంటికి ఆయన, ఆయన ఇంటికి నేను వెళ్తుంటాం. కార్యకర్తలు కూడా అలానే ఉండాలి. ఎన్నికల వరకే.. రాజకీయం. తర్వాత.. మనం నాయకులం.. మీరు కార్యకర్తలు.. అన్న సంగతి మరిచిపోకూడదు“ ఇదీ.. దివంగత నటుడు, రాజకీయ నాయకుడు యూ. కృష్ణంరాజు(చేసిన మేలిమి ప్రసంగం. ఆయన నరసాపురం నుంచి పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు.. కనుమూరి బాపిరాజు.. కాంగ్రెస్‌పక్షంలో ప్రత్యర్థిగా పోటీ చేశారు.కానీ, రాజకీయాలను రాజకీయాలకే పరిమితం చేశారు.
ఇదే విషయాన్ని ఓ సందర్భంలో కృష్ణంరాజు బహిరంగ వేదికపై చెప్పడం.. అప్పటికే కాదు.. ఇప్పుడు కూడా నాయకులు ఆచరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే.. రాజకీయాలు అంటే.. కొట్టుకోవడం.. తిట్టుకోవడం.. మడత పెట్టుకోవడం అనే సంకేతాలు భావితరాలకు వెళ్లే ప్రమాదం పొంచి ఉందనడంలో ఎలాంటి సందేహాలు లేవు.