brs-bjp
తెలంగాణ రాజకీయం

తెలంగాణలో మళ్లీ  తెరపైకి పొత్తులు

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంటాయని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కిషన్ రెడ్డి నిర్మోహమాటంగా ఖండించారు. కేసీఆర్ ను కల్వకుంట్ల కరప్షన్ రావు గా అభివర్ణిస్తూ వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణలో17 పార్లమెంట్ సీట్లను గెల్చుకుంటామని తెలంగాణ బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. అయితే ఈ ప్రచారంపై ఇంత వరకూ బీఆర్ఎస్ ఎలాంటి స్పందనా వ్యక్తం  చేయలేదు. పొత్తుల కోసం బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  బీజేపీ హైకమాండ్‌కు ప్రతిపాదనలు వెళ్లాయని ఆ ప్రతిపాదనలపై అంతర్గత చర్చ కూడా జరిగిందని చెబుతున్నారు. కానీ రాష్ట్ర ముఖ్య నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని చెబుతున్నారు.  తెలంగాణలో పొత్తులంటూ జరుగుతున్న ప్రచారాన్ని  ఆయన అలాంటి ఆశలు పెట్టుకోవద్దని నేరుగా చెప్పినట్లయింది. పొత్తుల ప్రచారం ప్రారంభమైన తర్వాత మొదట బండి సంజయ్ ఘాటుగా స్పందించారు.

మెడ మీద తలకాయ ఉన్న వారెవరూ బీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకోరని వారించారు. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం.. బీజేపీతో పొత్తులంటాయన్నట్లుగా కామెంట్లు చేయడంతో.. కిషన్ రెడ్డి స్పందించక తప్పలేదు. బీజేపీతో పొత్తుల విషయంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలతో అనేక రకాల ప్రచారాలు ప్రారంభమైనా  బీఆర్ఎస్ హైకమాండ్ మాత్రం ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఎవరూ స్పందించలేదు. పొత్తులపై అసలు మాట్లాడవద్దని నేతలను అతర్గతంగా ఆదేశించినట్లుగా తెలుస్తోంది.  అయితే  స్వయంగా కిషన్ రెడ్డి కూడా ఖండించడంతో పాటు కేసీఆర్ పై ఆరోపణలు చేయడంతో..  బీఆర్ఎస్ గట్టిగా రివర్స్ కౌంటర్ ఇస్తుందని అనుకున్నారు. కానీ ఆ పార్టీ నేతలు పెద్దగా స్పందించడానికి ఆసక్తి చూపించడం లేదు. బీజేపీపై విమర్శలు చేయకూడదన్న  విధాన నిర్ణయం తీసుకుని ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది.పొత్తులపై బీజేపీ క్లారిటీ ఇచ్చేయడంతో  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగుతుందని అనుకోవచ్చు.  ఇప్పటికే లోక్ సభ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్య పోరుగా ప్రజల్లోకి వెళ్తోంది.

వచ్చే నెల రోజుల్లో ఇలాంటి మూమెంట్ పెరిగితే… బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.   నిజానికి బీఆర్ఎస్, బీజేపీ పొత్తులు పెట్టుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమని  అంచనాలు ఉన్నాయి.  బీఆర్ఎస్ కూడా బీజేపీతో కలిసి మెజార్టీ లోక్ సభ సీట్లు గెల్చుకుని ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ప్రణాళిక – వేసుకుందని కూడా చెప్పుకున్నారు. అలాంటిదేమీ లేదని బీఆర్ఎస్ తో పొత్తుల ఆలోచన అసలు చేయడం లేదని బీజేపీ క్లారిటీ ఇవ్వడంతో స్పష్టత వచ్చింది. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. బీఆర్ఎస్ పొత్తు ఆలోచనలపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో కథ ఇంకా ఉందని అనుకోవచ్చు.