lakhpatis-AP women
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

లక్షాధికారుల్లో ఏపీ మహిళలే ఎక్కువ

దేశ వ్యాప్తంగా స్వయం సహాయక బృందాల స్వావలంబనతో లక్షాధికారులైన మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. స్వయం సహాయక బృందాల్లో వార్షికాదాయం లక్ష రుపాయలు కంటే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్న మహిళల సంఖ్య కోటిని దాటింది.ఇలా ఏటా కనీసం లక్ష రుపాయలు సంపాదిస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్‌‌ కు చెందిన మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. ఏపీలో 13.65లక్షల మంది మహిళలు ఏటా లక్షకు మించిన ఆదాయాన్ని లాఖ్‌పతి దీదీ పథకంలో భాగంగా ఆర్జించ గలుగుతున్నారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఏపీలో అగ్రస్థానంలో నిలవగా బీహార్ రెండో స్థానంలో, పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో నిలిచాయి.రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాఖ్‌పతి దీదీ పథకం అమలులో లక్షద్వీప్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. అక్కడ ఒక్కరు లాఖ్‌పతి దీదీలు లేరు. అండమాన్‌ నికోబార్‌‌లో 242, గోవాలో 206మంది తో చివరి స్థానాల్లో ఉన్నాయి.గత ఏడాది ఆగష్టు 15న ఈ పథకాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు.

దేశంలో 2కోట్లమంది గ్రామీణ మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తామని ప్రకటించారు. బడ్జెట్‌లో మూడు కోట్ల మంది లక్షాధికారుల్ని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదిలోనే కోటిమంది మహిళలు ఈ పథకంలో భాగంగా లక్ష రుపాయల ఆదాయం పొందుతున్నట్లు పేర్కొన్నారు.దీన్‌ దయాళ్ అంత్యోదయ యోజన- గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా మూడేళ్లలో లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఈ పథకంలో భాగంగా మహిళలకు శిక్షణ, ఆర్ధిక సాయం, స్వయం ఉపాధి పథకాలకు తోడ్పాడు, బ్యాంకులతో సమన్వయం ఏర్పాటు చేయడం, క్రెడిట్ లింకేజీ సదుపాయాలు కల్పించడం ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో ఏటా కనీసం లక్ష రుపాయల ఆదాయం సంపాదించేలా మహిళలకు తోడ్పాడు అందించాలని నిర్ణయించారు.మహిళలకు సాధికారత కల్పించడంలో భాగంగా పది కోట్ల మంది మహిళల్ని స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా చేర్పించారు.

వీటి ద్వారా గణనీయమైన ఫలితాలను సాధించగలిగారు.జనాభాలో పెద్ద రాష్ట్రాలుగా ఉన్న యూపీ వంటి రాష్ట్రాల్లో 6.68లక్షల మందిని మాత్రమే లక్షాధికారులు చేయగలిగారు. గుజరాత్‌లో 4.94లక్షలు, తమిళనాడులో 2.63లక్షలు, కేరళలో 2.31లక్షల మంది, మధ్యప్రదేశ్‌లో 9.54లక్షలు, మహారాష్ట్రలో 8.99లక్షలు, రాజస్థాన్‌లో 2.02లక్షల మంది లక్షాధికారులయ్యారు.కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్‌లో 51,723, జమ్మూ కశ్మీర్‌లో 29,070 మంది లక్షాధికారులుగా మారారు. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాంలో 4.64లక్షలు, మేఘాలయలో 33,856మంది, మిజోరాంలో 16087, మణిపూర్‌లో 12,499మంది, నాగాలాండ్‌లో 10,494మంది ఈ పథకంలో లబ్ది పొందారు.మరోవైపు గత పదేళ్లలో స్వయం సహాయక బృందాల్లో నిరార్థక ఆస్తుల విలువ గత పదేళ్లలో గణనీయంగా తగ్గిపోయింది. బిజినెస్‌ కరస్పాండెంట్‌ల ద్వారా క్షేత్ర స్థాయిలో బృందాలకు బ్యాంకుల మధ్య సమన్వయం ఏర్పడుతోందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వివరించారు.2013-14 నుంచి దాదాపు రూ.6.96లక్షల కోట్ల రుపాయల రుణాలను స్వయం సహాయక బృందాలు వినియోగించుకున్నట్టు గణాంకాలు వివరిస్తున్నాయి. 2014లో 9.58శాతం నిరార్ధక ఆస్తులుగా ఉంటే వాటి సంఖ్య ఇప్పుడు 1.8శాతానికి పడిపోయింది. స్వయం సహాయక బృందాలు లాభాల్లో పయనిస్తున్నాయి.

బిజినెస్‌ కరెస్పాండెంట్ సఖీలను మరింత విస్తరించేందుకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. దేశంలోని 2.7లక్షల గ్రామ పంచాయితీలకు ఒక్కో బిజినెస్‌ కరస్పాండెంట్‌ సఖిలను నియమించాలని యోచిస్తోంది. లాఖ్‌పతి దీదీ పథకాన్ని విజయవంతం చేసేందుకు మరింత విస్తృతంగా వారి సేవల్ని వినియోగించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం 1.22లక్షల మంది బిజినెస్ కరెస్పాండెంట్‌ సఖీల్లో యూపీలో 42,666, మధ్యప్రదేశ్‌లో 10850, రాజస్థాన్‌లో 10559మంది ఉన్నారు. దేశంలోని మహిళల్లో మూడు కోట్ల మంది మహిళలను “లఖపతి దీదీలుగా” మార్చాలను కుంటున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌ పర్యటనలో త్వరలోనే లక్ష్యాలను చేరుకోనున్నట్లు ప్రధాని ప్రకటించారు. .గ్రామీణ జీవిక పథకం కింద రుణ పథకాన్ని ఉపయోగించుకోవాలని, గ్రామీణ మహిళల విజయానికి సహకరించాలని పిలుపునిచ్చారు. లాఖ్‌పతి దీదీ కార్యక్రమం ద్వారా మహిళల జీవితాల్లో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు ప్రధాని తెలిపారు.