kavitha-ED
తెలంగాణ రాజకీయం

మళ్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ హాట్ టాపిక్కేనా

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఇందులో నిందితురాలిగా పరిగణించింది. ఈ మేరకు కవితకు సీబీఐ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ కేసులో ఫిబ్రవరి 26న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు కవితను కూడా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కల్వకుంట్ల కవితను సీబీఐ మూడుసార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2022లో ఇదే కేసులో సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్‌ కేసులో నిందితురాలిగా సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవరిస్తూ తాజాగా మరోసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అప్పుడు చేసిన దర్యాప్తు తర్వాత కవితను నిందితురాలిగా సీబీఐ పరిగణించింది.లిక్కర్ కేసులో సీబీఐ హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమెను విచారణ చేసి.. ఆమె స్టేట్‌మెంట్‌ తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా కొన్నిసార్లు కవితను ఢిల్లీలోని తమ కార్యాలయానికి ఆహ్వానించి ప్రశ్నించింది. ఆఖరుసారి గత ఏడాది జనవరి 16న విచారణకు రావాల్సిందిగా కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ సీబీఐ విభాగం ఆమెకు నోటీసులు ఇచ్చింది. మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని, అమ్మకందారులకు లబ్ధి చేకూర్చేలా దీన్ని రూపొందించారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్లు సీబీఐ ఆరోపణ. నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కూడా మరో కేసు నమోదు చేసింది. గత ఏడాది ఫిబ్రవరి 26న అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోదియాను అరెస్టు చేశారు. మద్యం అమ్మకాల్లో కీలకంగా మారిన సౌత్‌ కార్టల్‌ తరఫున కవిత కీలకంగా వ్యవహరించారని, మద్యం వ్యాపారులతో కలిసి పలుమార్లు సమావేశాలు నిర్వహించారని, ఇదే పనిమీద పలుమార్లు ఢిల్లీ కూడా వచ్చారన్నది సీబీఐ, ఈడీల వాదన.మహిళల్ని ఇంటి వద్దనే విచారించాలని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఆ పిటిషన్ ఈడీ కేసునకు సంబంధించింది. ఇప్పుడు సీబీఐ నోటీసులు జారీ చేసింది.  ఈ నెలాఖరులో విచారణ జరగనున్న సమయంలో సీబీఐ నోటీసులు కలకలం రేపుతున్నాయి.  ఈ కేసులో ఆమె ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్‌ బుచ్చిబాబు, ఆమె తరఫున ప్రతినిధులుగా వ్యవహరించినట్లు కేసులో పేర్కొన్న మద్యం వ్యాపారి, వైసీపీ నాయకుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరుణ్‌రామచంద్ర పిళ్లై, శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్‌ బోయినపల్లిని కూడా ఈడీ అరెస్టు చేసింది. వీరిలో మాగుంట రాఘవరెడ్డి, శరత్‌చంద్రారెడ్డిలు అప్రూవర్‌లుగా మారి బెయిల్‌ సంపాయించారు. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని రామచంద్ర పిళ్లై అభ్యర్థన మేరకు న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. మిగతావారు ఇంకా జైల్లోనే ఉన్నారు.దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హైదరాబాద్‌ వచ్చి కవితను ఆమె ఇంట్లో ప్రశ్నించారు. ఈడీ అధికారులు మాత్రం రెండుసార్లు ఢిల్లీ పిలిపించి విచారించారు. తర్వాత సుప్రీంకోర్టులో విచారణకు హాజరు కాకుండా ఆదే్శాలు తెచ్చుకున్నారు కవిత.

సీబీఐ నోటీసులు జారీ చేసింది కాబట్టి  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తున్నట్టేనా..  అంటే.. ఈ కేసు బయటకు వచ్చిపన్పటి నుండి జరుగుతున్న పరిణామాలను చూస్తే.. కవిత సేఫ్ అన్న అభిప్రాయం ఎక్కువ మందికి వస్తుంది.  పార్లమెంటు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కి బీజేపీ కి మధ్య ఎటువంటి లాలూచీ కుస్తీ లేదని నిరూపించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి బీజేపీ అగ్రనాయకత్వం తంటాలు పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ మద్యం కేసులో ఫిబ్రవరి 26న విచారణకు రావాలంటూ సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసిందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఎందుకంటే..సీబీఐ కవితను ప్రశ్నించి నెలలు గడిచిపోతోంది.  గతంలో హైదరాబాద్ వచ్చి రెండు సార్లు కవితను ప్రశ్నించింది సీబీఐ. రెండో సారి ప్రశ్నించినప్పుడు మరోసారి పిలుస్తామని చెప్పి నోటీసులు ఇచ్చారు. మళ్లీ ఇప్పటి వరకూ సీబీఐ నుంచి పిలుపు రాలేదు.  మధ్యలో కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బాగా లబ్దిపొందారని  .. ఆస్తులు సంపాదించారని.. కొన్ని వివరాలతో చార్జిషీట్ వేశారు.

మళ్లీ పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేశారు.  ఈడీ కేసులు వేరు.. సీబీఐ కేసులు వేరు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ వేరుగా విచారణ జరుపుతోంది. ఆ విచారణను తనను పిలవొద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. నెలల తరబడి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. కవిత రిలాక్స్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు సీబీఐ నోటీసులు ఇచ్చింది. సౌత్ లాబీ నుంచి దాదాపుగా అందరూ అప్రూవర్లు అయ్యారు కవిత తప్ప. అలా అప్రూవర్ అయిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కవితకు నోటీసులు ఇచ్చారని అంటున్నారు. అయితే కవితకు నోటీసులు వెనుక అసలు టార్గెట్ కేజ్రీవాల్ అని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  చెబుతున్నాయి. సీబీఐ కేసు నమోదు చేసింది… మనీ లాండరింగ్ మీద..డబ్బు లావాదేవీల మీద కాదు. స్కామ్ పాలసీలో మార్పు.. క్విడ్ ప్రో కో వంటి అంశాల మీద. మనీ లాండరింగ్ మీద..డబ్బు లావాదేవీల మీద  ఈడీ కేసులు నమోదు చేసింది. పాలసీ మార్పు విషయంలో  మాగుంట రాఘవరెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. కేజ్రీవాల్ కు, ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బు అందేలా చేశామని ఆయన అంటున్నారు.

సౌత్ లాబీకి సంబంధించినంత వరకు ఈ వ్యవహారంలో కవిత పాత్ర కీలకం కాబట్టి ఆమెను విచారణకు పిలుస్తున్నారు. కానీ కవితను గట్టిగా ఫ్రేమ్ చేసే అవకాశాలు లేవని.. కేజ్రీవాల్ ను మాత్రమే టార్గెట్ చేస్తారని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో కేజ్రీవాల్ ను సీబీఐ విచారించింది. ఈడీ విచారణకు మాత్రం కేజ్రీవాల్ హాజరు కావడం లేదు. కవిత విచారణ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.కవిత విచారణకు హాజరవడం కష్టమేనని న్యాయపరమైన అవకాశాల్ని వెదుక్కుంటారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున హాజరుకాబోనని సమాధానం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయంలో సీబీఐ స్పందన తీవ్రంగా ఉంటుందని  బీఆర్ఎస్ వర్గాలనుకోవడం లేదు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ .. ఎలా స్పందిస్తుందో అంచనా వేయడం కష్టం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఇటీవల కూడా.. తెలంగాణకు వస్తున్న బీజేపీ నేతలు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో  ఎవర్నీ వదిలేది లేదని.. తప్పు చేసిన వారిని జైలుకు పంపుతామని అంటున్నారు. అందుకే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తదుపరి పరిణామాలు అంచనా వేయడం కష్టమేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.