అబ్కారీ శాఖ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ శాఖలోని కొంతమంది అవినీతిపరులు బార్‌ల షిప్టింగ్ పేరుగా భారీగా దండుకుంటున్నారు. ఉన్న బార్‌ను ఒకచోట నుంచి మరోచోటికి మార్చేందుకు పెద్ద మొత్తంలో బేరాలు కుదుర్చుకుని సూట్ కేసులు నింపేసుకున్నారు. ఇప్పుడు ఆ లంచంగాళ్లు మింగిన అవినీతిని కక్కించడమే కాకుండా ఇంకా ఏయే కోణాల్లో అక్రమ వసూళ్లు చేశారో బయటకు లాగే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ సర్కార్. ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకుని లోతైన దర్యాప్తు దిశగా అడుగులు వేస్తోంది.ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున మద్యం, బార్ షాపులకు లైసెన్స్‌లు ఇచ్చేశారు. ఆ సమయంలో లైసెన్స్‌లు తీసుకున్నవాళ్లు GHMC పరిధిలో బార్ పెట్టుకోవాలన్నా, షిఫ్ట్ చేసుకోవాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందేనని కొందరు అధికారులు డిమాండ్ చేశారట. ఒక్కో బార్ షాపు షిఫ్ట్ చేసేందుకు దాదాపు 20 లక్షల వరకు అధికారులు డిమాండ్ చేసినట్లు వినికిడి. గ్రేటర్ పరిధిలో బార్ పెట్టాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి.
బిల్డింగ్ పర్మిషన్, లిక్కర్ పర్మిషన్, బార్ కౌంటర్, పార్కింగ్, కిచెన్ ఏరియా, టాయిలెట్స్, ఫైర్ సేఫ్టి అనేవి తప్పనిసరిగా ఉండాలి. అలాగే ట్రేడ్ లైసెన్స్, లీజ్ డాక్యుమెంట్, లేబర్ లైసెన్స్ రిజిస్టర్ ఉండాలి. ఇక, అదే బార్ షిప్టింగ్ చేయాలంటే GST, IT క్లియర్‌గా ఉండాలి. సరిగా ఉన్న ఈ డాక్యుమెంట్లను ఎక్సైజ్ కమిషనర్ ఆఫీసులో దరఖాస్తు చేస్తే అన్ని పరిశీలించి క్లియర్‌గా ఉంటే వెంటనే బార్ పెట్టుకోవడానికి, షిప్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు ఎక్సైజ్ అధికారులు.
రూల్స్ క్రాస్ చేసి దండుకునే బ్యాచ్ చాలా డిపార్ట్‌మెంట్స్‌లో ఉంటారు. అలాంటి బాపతే ఎక్సైజ్ శాఖలోనూ ఉన్నారు. దాదాపు రూ. 20లక్షలు నుండి 30లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్లకు బార్ షిఫ్ట్ చేసేందుకు ఆగమేగాల మీద పర్మిషన్ ఇచ్చారట. ఇలా నాలుగు నెలల్లోనే కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉన్నతాధికారితో పాటు కీలకమైన స్టేషన్ల ఇన్స్‌పెక్టర్లు ఆధ్వర్యంలో ఈ అవినీతి తంతు నడుస్తోందట. గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖలో పోస్టింగ్ కోసం పైరవీలు కూడా పెద్ద ఎత్తున జరిగాయట. అక్కడ పెద్దోళ్లకు చెల్లించిన సొమ్మును రాబట్టుకునేందుకు ఇప్పుడు బార్ లైసెన్స్, షిప్టింగ్‌ల కోసం వచ్చే యజమానుల నుంచి లక్షల్లో లంచాలను డిమాండ్ చేస్తున్నారట. అలా ఖాళీ అయిన జేబులను ఇలా నింపుకుంటున్నారట అబ్కారీ శాఖ అవినీతి బకాసురులు.
ఎక్సైజ్ శాఖలో బార్ చాటున సాగుతున్న అవినీతి యవ్వారం తెలంగాణ సర్కార్ దాకా వెళ్లింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో ఉన్నాధికారులు రంగంలోకి దిగారట. ఎక్కడెక్కడ.. ఏ రకంగా.. ఏ రూట్లో ఈ అవినీతి సాగింది. ఎవరెవరు ఉన్నారు.. ఎవరి డైరక్షన్‌లో ఈ అవినీతి సాగిందన్న కోణంలో విచారణ చేపట్టింది రాష్ట్ర సర్కార్.