raavi-river
జాతీయం రాజకీయం

ఎట్టకేలకు 45 ఏళ్ల తర్వాత డ్యామ్‌ నిర్మాణం పూర్తి

ఎట్టకేలకు 45 ఏళ్ల తర్వాత డ్యామ్‌ నిర్మాణం పూర్తయ్యింది. దీంతో పాకిస్థాన్‌కు నదీ జలాలు బంద్‌ అయ్యాయి. ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో సంతకం చేసిన 1960 సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి నదీ జలాలపై భారత్‌కు ప్రత్యేక హక్కులు ఉన్నాయి. దీంతో పాకిస్థాన్‌కు వెళ్లే నీటిని అడ్డుకునేందుకు రంజిత్‌ సాగర్‌ డ్యామ్‌, దిగువన షాపూర్ కంది బ్యారేజీ నిర్మించడానికి పంజాబ్‌, జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వాలు 1979లో ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1982లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1998 నాటికి ఈ డ్యామ్‌ పూర్తవుతుందని భావించారు.కాగా, రంజిత్ సాగర్ డ్యామ్ నిర్మాణం 2001లో పూర్తయ్యింది. అయితే షాపూర్ కంది బ్యారేజీ నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. 2008లో దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. 2013లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే 2014లో పంజాబ్, జమ్ముకశ్మీర్‌ మధ్య వివాదాల కారణంగా ప్రాజెక్ట్ మళ్లీ నిలిచిపోయింది.మరోవైపు 2018లో కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వల్ల ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది.

అనంతరం ప్రారంభమైన డ్యామ్‌ నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. దీంతో రావి నదీ జలాలు పాకిస్థాన్‌కు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు పాక్‌కు వెళ్తున్న ఈ నీటిని జమ్ముకశ్మీర్‌తోపాటు పంజాబ్‌, రాజస్థాన్‌లోని పలు జిల్లాలకు సాగునీటి కోసం వినియోగించనున్నారు. అలాగే డ్యామ్ నుంచి ఉత్పత్తి అయ్యే హైడల్ పవర్‌లో 20 శాతం విద్యుత్‌ జమ్ముకశ్మీర్‌ పొందుతుంది.