తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని మోదీని కలిశారు రేవంత్ రెడ్డి. ఈయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్దిని పరుగులు పెట్టించేందుకు ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక కేంద్రం నుంచి రావల్సిన నిధులు, పాత బకాయిలు, పెండింగ్ లో ఉన్న బిల్లులపై చర్చించారు. రేవంత్ రెడ్డి చెప్పిన వాటిని తప్పకుండా అమలు చేస్తామని మోదీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.విభజన హామీకి సంబంధించిన పెండింగ్ నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల మంజూరు కోసం కేంద్రాన్ని అభ్యర్థించారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్ర పురోగతికి అవసరమైన విన్నపాల జాబితా పట్టుకుని రేవంత్, విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్లు, పెండింగ్ నిధుల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉంది. ఈ పథకం కింద హైదరాబాద్ మినహా అప్పటి ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు 50 కోట్ల చొప్పున 450 కోట్లు రావాల్సి ఉంది. గత మూడేళ్లకు సంబంధించి 1,350 కోట్ల రూపాయల గ్రాంటు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని విడుదల చేయాలని ప్రధాని మోదీని, సీఎం రేవంత్ కోరినట్లు తెలుస్తోంది.అలాగే కృష్ణా జలాల పంపకాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న క్రమంలో అటు ఏపీ, ఇటు తెలంగాణ పోలీసులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద భారీగా మొహించారు. ఏపీ పరిధిలో ఉన్న గేట్లకు కంచె ఏర్పాటు చేశారు. తమ నీళ్లను తాము వినియోగించుకుంటున్నామని చెప్పారు అక్కడి ఇరిగేషన్ అధికారులు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాబోయేది తమ ప్రభుత్వం అని నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కూర్చొని చర్చించుకుంటామన్నారు.