ముఖ్యాంశాలు

హాలీవుడ్ లో దృశ్యం

హాలీవుడ్‌ని స్ఫూర్తిగా తీసుకుని చాలా సినిమాలు ఇండియాలో రీమేక్‌ అయ్యాయి. కానీ భారతీయ సినిమాలను నేరుగా హాలీవుడ్‌లో రీమేక్ చేసినవి ఏమి లేవు. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఏకంగా హాలీవుడ్ లో రీమేక్ అవ్వనుంది. అదికూడా ఓ సౌత్ సినిమా. అదే ‘దృశ్యం’. ఈ సినిమాను హాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్లాన్ రెడీ అయ్యింది . ఈ సినిమా రీమేక్ కోసం పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు చేతులు కలిపాయి. దృశ్యం సినిమా ఇప్పటికే పలు భారతీయ భాషల్లో రీమేక్ అయింది. తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, తమిళం  తదితర భాషల్లో రీమేక్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది . దృశ్యం తెలుగు రీమేక్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు. మన దగ్గర ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆతర్వాత వచ్చిన దృశ్యం 2 కూడా సూపర్ హిట్ గా నిలిచింది. మరి ఇప్పుడు హాలీవుడ్ లో ఎవరు నటిస్తారో చూడాలి.ఇది ఒరిజినల్ మలయాళ సినిమా. మోహన్ లాల్, మీనా జంటగా నటించిన ‘దృశ్యం’ చిత్రం 2013లో విడుదలై సూపర్ హిట్ అయింది. తరువాత ఈ చిత్రం తెలుగులో రీమేక్ అయ్యింది.అలాగే హిందీలో కూడా రీమేక్ అయ్యింది. అక్కడ అజయ్ దేవగన్ హీరోగా నటించాడు.

అదేవిధంగా కన్నడలో దృశ్య గా..  2015లో ‘దృశ్యం’ సినిమాను తమిళంలో ‘పాపనాశం’ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో కమల్ హాసన్ హీరోగా నటించారు. ఈ చిత్రం 2017లో సింహళ భాషలో మరియు 2019లో చైనీస్ భాషలో రీమేక్ చేశారు. 2021లో ఇండోనేషియా అలాగే 2023లో కొరియన్ రీమేక్ అయ్యింది.  ఇప్పుడు ‘దృశ్యం’ సినిమాను హాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు.‘దృశ్యం’ సినిమా విదేశీ రీమేక్ హక్కులను ‘పనోరమా స్టూడియోస్’ కొనుగోలు చేసింది. ఆ సంస్థ ఇప్పుడు ‘దృశ్యం’ చిత్రాన్ని ‘గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్’, ‘జోట్ ఫిల్మ్స్’తో పాటు హాలీవుడ్‌లో రీమేక్ చేయనుంది. ఈ విధంగా రీమేక్ అవుతున్న తొలి భారతీయ సినిమాగా దృశ్యం పేరు తెచ్చుకుంది. హాలీవుడ్ తర్వాత మరో 3 నుంచి 5 ఏళ్లలో 10 దేశాల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్టు ఈ నిర్మాణ సంస్థలు తెలిపాయి.