ap bjp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

త్వరలో బీజేపీ జాబితా

పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. బీజేపీ త్వరలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది. మొదటి జాబితా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. గురువారం అర్థరాత్రి వరకు బీజేపీ హైకమాండ్ సమావేశాలు కొనసాగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలతో సమావేశమైన అగ్రనేతలు ఒక్కో సీటుపై చర్చలు జరిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో తొలి సమావేశం రెండు గంటల పాటు సాగింది. ఆ తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 4.30గంటల పాటు మేధోమథనం జరిగింది. బీజేపీ హెడ్ క్వార్టర్‌లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు సీట్లపై చర్చ కొనసాగింది. దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్‌సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేసినట్లు సమాచారం.

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ఎప్పుడైనా విడుదల చేయవచ్చు.
ఈ రెండు సమావేశాల్లోనూ తొలి జాబితా ఖరారుపై చర్చలు జరిగాయి. విశేషమేమిటంటే.. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఎంపీల ఎంపిక కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గురువారం సాయంత్రం 7 గంటలకు ప్రధాని నివాసంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌షాతో ఆయన సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, భూపేంద్ర యాదవ్‌, రాష్ట్రాలకు చెందిన నేతలు ఇక్కడకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీ ఈ ఎన్నిక‌ల్లో మ‌రికొంద‌రు పాత నేత‌ల‌కు టికెట్లు క‌ట్ చేస్తుందా లేక అభ్యర్థుల ఎంపికలో కొత్త ప్రయోగాలు చేస్తుందా అనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే చర్చ జరుగుతోంది.వచ్చే లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది.

లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందే, ఉత్తరప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాల్లోని బలహీనమైన స్థానాలపై బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించాలనుకుంటోంది. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన స్థానాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు చాలా కాలంగా కసరత్తు జరుగుతోంది. కేంద్ర మంత్రుల బృందాలను కూడా క్షేత్రస్థాయిలోకి పంపారు. ఈ స్థానాల్లో గెలుపు అవకాశాలు పెరిగాయని పార్టీ భావిస్తోంది. అందుకే ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.