లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో తెలంగాణలో రెండు జాతీయ పార్టీల కన్నా ఎక్కువగా ఒత్తిడికి గురవుతోంది భారత రాష్ట్ర సమితి. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల ఎలాంటి ప్లస్ పాయింట్లు ఉంటాయని కేసీఆర్ అంచనా వేసుకున్నారో ఇప్పుడు.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లో మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోవాల్సి రావడం అంతగా మైనస్ అవుతోంది. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. మరో వైపు పోటీకి సిద్ధంగా లేని పార్టీ నేతలు, బలమైన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడం .. మరితం టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. ఈ సమయంలో బలంగా ప్రజల్లోకి వెళ్లడానికి ఓ అజెండా కూడా కరవైంది. కానీ ..తెలంగాణ ఉద్యమంలో కీలకమైన నీళ్ల అజెండాతోనే వెళ్లాలని డిసైడయ్యారు. కాళేశ్వరం విషయంలో తాము చేసిన కృషిని తక్కువ చేస్తున్న ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడయ్యారు. తెలంగాణ ఉద్యమం నాటి నినాదమే నేటి ఓట్లనాదమైంది. ఉద్యమ కాలం నాటి నీళ్లు, నిధులు, నియామకాలు- నినాదం మార్మోగుతూనే ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దశాబ్దం కావొస్తున్నా- ఉద్యమ కాలం నాటి నీళ్లు, నిధులు, నియామకాలు- నినాదం మార్మోగుతూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాటర్ వార్ ఓ రేంజ్ కి వెళ్లింది. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌గా చేసుకొని విమర్శలు చేస్తోంది. ఇప్పుడు అదే ప్రాజెక్టును ఆయుధంగా చేసుకొని హస్తం పార్టీపై కౌంటర్ అటాక్ ప్రారంభించింది గులాబీ పార్టీ. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్.. కాళేశ్వరం సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే సమయంలో నీటి పోరు యాత్రలో భాగంగా కరీంనగర్‌లో భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల సందర్శన పేరిట ప్రజాక్షేత్రంలోకి దిగనుంది. బహుశా ఎన్నికలయ్యేంత వరకు ఈ కార్యాచరణ కొనసాగుతుందని అంచనా. కృష్ణా జలాల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఇటీవల నల్లగొండలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది.
కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గిన కాంగ్రెస్.. కృష్ణా జలాలపై హక్కులను కోల్పోయేలా చేసిందని ఆరోపించింది. ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ నీటి పోరు యాత్రలకు పిలుపునిచ్చింది బీఆర్‌ఎస్. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసింది. అయితే.. ఈ ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ఎన్నికలకు ముందు కుంగిపోయిన విషయం వెలుగు చూసింది. అప్పటినుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టేందుకు అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేసింది. ‘కాళేశ్వరం ఓ విఫల ప్రాజెక్టు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. కాళేశ్వరం బీఆర్ఎస్ అవినీతికి పెద్ద ప్రాజెక్ట్. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలి’ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి.. బ్యారేజీలోని లోపాలను ఎత్తిచూపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ మాత్రమే కాదని, ప్రాజెక్టులో ఇది ఒక బ్యారేజీ మాత్రమేనని చెబుతోంది బీఆర్‌ఎస్.
ఈ క్రమంలోనే మార్చి ఒకటో తేదీ నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది బీఆర్‌ఎస్. 150 నుంచి 200 మంది బీఆర్‌ఎస్ ప్రతినిధులతో మేడిగడ్డను సందర్శించి… వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని ప్రకటించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతేకాదు.. తమ వెంట సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎవరైనా రావొచ్చని పిలుపునిచ్చారు. కానీ కేసీఆర్ ను తీసుకెళ్లాలని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు చేస్తున్న ప్రభుత్వం.. ఎలాంటి విచారణ అయినా జరుపుకోవచ్చని ప్రకటించింది బీఆర్‌ఎస్. మేడిగడ్డలో కొంత భాగం దెబ్బతిన్నప్పటికీ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందంటున్న గులాబీ పార్టీ.. ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టాలని హితవు పలుకుతోంది. గోదావరి జలాల వినియోగంపై చేపట్టనున్న నీటి పోరు యాత్రలో భాగంగా.. మార్చి 10న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సభ ద్వారా పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేలా దశలవారీ కార్యక్రమాలకు పిలుపిచ్చింది. మేడిగడ్డ తర్వాత మిగతా బ్యారేజీలు, రిజర్వాయర్లను కూడా సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎలా చూసినా బీఆర్ఎస్ ఈ సారి నీళ్లతో ఓట్ల పంట పండించాలని అనుకుంటుంది. కానీ ఆ సెంటిమెంట్ రేపడం.. అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ స్వయం పాలనలో ఉంది.