తెలంగాణ ముఖ్యాంశాలు

అసని తూఫాన్ ఎఫెక్ట్ : తెలంగాణలోని 8 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు..

అసని తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడుతుండగా, తెలంగాణ లోని పలు జిల్లాలో నిన్న సాయంత్రం నుండి చిరు జల్లులు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలు పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రేపు కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఇక ఏపీ విషయానికి వస్తే అసని తూఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం తీరానికి ఓ రథం కొట్టుకొని వచ్చింది. ఉప్పాడ, తొండంగిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను అసని తుఫాను వణికిస్తోంది. నిన్న రాత్రంతా తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు, పలుచోట్ల వర్షాలు కురిసాయి. బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. రేపల్లె, నిజాంపట్నం, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో భారీ వర్షం పడుతోంది. తుపాను తీవ్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. నిజాంపట్నం హార్బర్లో 8వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. రాబోయే మూడు రోజుల్లో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు రెడ్‌అలర్ట్‌ జారీ చేశారు. కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.