లోక్ సభ ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణ భవన్ లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. కరీనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులపై కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కరీంనగర్ పార్లమెంట్ స్థానంకు వినోద్ కుమార్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానంకు కొప్పుల ఈశ్వర్ పేర్లను ఇప్పటికే కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో భేటీ అయ్యి ఉమ్మడి జిల్లాల పరిధిలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. .ఈనెల 10వ తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ సభలో కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం పరంగా లేవనెత్తుతున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు కేసీఆర్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో బహిరంగ ఏర్పాట్లపైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత చర్చించే అవకాశం ఉంది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిలోకి కృష్ణా జలాల విషయంలో గతంలో నెలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఛలో నల్గొండ పేరుతో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఇప్పుడు గోదావరి జలాల విషయంలో కరీంనగర్ లో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించి కాళేశ్వరంపై ప్రజలకు సరైన సమాచారం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బహిరంగ సభ విషయంపై ఉమ్మడి కరీనగర్ జిల్లా నేతలతో కేసీఆర్ చర్చించి, సభ విజయవంతంకు తీసుకోవాల్సిన చర్యలను సూచించే అవకాశం ఉన్నట్లు సమాచారం.