prashant kishore
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పీకేపై వైసీపీ నేతల ఫైర్

ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఏపీ మంత్రులు పీకేపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా మాయల ఫకీరా అని ప్రశ్నిస్తున్నారు. బిహార్లో రాజకీయ పార్టీ పెట్టి, వివిధ పార్టీలకు పొలిటికల్ వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ కు ఏపీ రాజకీయాలతో ఏంటి సంబంధం అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్  ప్రశ్నించారు.హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఒక కాన్లేవ్ లో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ఏపీలో జగన్ ప్రభుత్వం మళ్లీ రాదంటూ చేసిన ప్రకటనపై మంత్రి అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఆయన మాట్లాడుతూ.. బిహార్లో ప్రశాంత్ కిషోర్ ఓటమిపాలు అవుతాడు అన్నది మా నమ్మకం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి చిత్తుగా ఓడిపోతుందనేది పేదవాడి ఫీలింగ్ అని అమర్నాథ్ చెప్పారు.

ప్రశాంత్ కిషోర్ మాటలను ఎవరు పరిగణలోకి తీసుకోరని, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారని అమర్నాథ్ స్పష్టం చేశారు. పీకే చెప్పిన మాటలకు ఎల్లో మీడియా విస్తృత ప్రచారం కల్పించి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. గడిచిన 5 సంవత్సరాలలో సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం రెండున్నర లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, పేదలందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చేసిందన్నారు. ఈ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వెయ్యరంటూ పీకే చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఏమాత్రం చేయని చంద్రబాబు ఏ విధంగా గెలుస్తాడని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు? ఈయన ఏమైనా మాంత్రికుడా? మాయల ఫకీరా అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ మాటలను ప్రజలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.గతంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సైతం ఏపీ ఎన్నికల ఫలితాలపై తప్పుడు జోస్యం చెప్పి సన్యాసానికి సిద్ధంగా ఉన్నాడంటూ అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారుమరికొన్ని రోజుల్లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కచ్చితంగా ఓడిపోతుందన్నారు. ఏపీ సీఎం జగన్ పార్టీ మామూలుగా కాదు, భారీ తేడాతో ఓటమి చెందుతుందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు