kapu-ycp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

కాపుల కోసం జగన్ మాస్టర్ ప్లాన్…

కాపు సీనియర్ నేతలపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాపు సీనియర్ నేతలు హరి రామజోగయ్య, ముద్రగడ పద్మనాభంపై దృష్టి పెట్టిన వైసీపీ.. వారిని పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోంది. ఇప్పటికే హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ ను పార్టీలో చేర్చుకుంది వైసీపీ. ముద్రగడతో కూడా సంప్రదింపులు జరిపింది. త్వరలోనే ఆయన వైసీపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తోంది. మరోవైపు వంగవీటి రాధాను పార్టీలోకి తెచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. వంగవీటి రాధాను బందర్ ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ప్రధానంగా కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలోని ముఖ్య నేతలకు వల వేసే పనిలో వైసీపీ ఉంది. ఇప్పటికే కాపు సీనియర్ నేతలు, కాపు పెద్దలుగా ఉన్న హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం.. ఇద్దరినీ తమవైపు తీసుకునే ప్రయత్నాల్లో వైఎస్ఆర్ సీపీ ఉంది. గతంలోనూ వైసీపీలో చేరేందుకు ముద్రగడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, చివరి నిమిషంలో ఆగిపోయింది.

రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ముద్రగడ చేరిక పెండింగ్ లో పడింది. ఆ తర్వాత ముద్రగడ జనసేన వైపు చూశారు. జనసేనలో చేరికకు సంబంధించి సంప్రదింపులు కూడా జరిగాయి. అయితే, ఆ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ఆయన వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే వైసీపీ కీలక నేత, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇప్పటికే ముద్రగడతో మాట్లాడారు. ఈ నెల 12న ముద్రగడ సీఎం జగన్ ను కలవబోతున్నారని సమాచారం. ముద్రగడ వైసీపీలో చేరతారా? లేక మద్దతు మాత్రమే ప్రకటిస్తారా? లేదంటే తన కుమారుడిని వైసీపీలో చేరుస్తారా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. జనసేన, పవన్ కల్యాణ్ కు మద్దుతుగా ఉంటూ వచ్చిన మరో కాపు సామాజికవర్గం కీలక నేత హరిరామ జోగయ్యపైనా వైసీపీ ఫోకస్ పెట్టింది. టీడీపీతో పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ 24 సీట్లకే పరిమితం కావడం పట్ల హరిరామజోగయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. జనసేనకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయనపైనా వైసీపీ ఫోకస్ పెట్టింది.