ఇజ్రాయెల్‌తో యుద్ధంలో పాలస్తీనాలోని గాజా లో పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడి ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలను ఆదుకునేందుకు పలు దేశాలు మానవతా సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. విమానాల ద్వారా ఆహారాన్ని గాజాలో ఎయిర్‌డ్రాప్ చేస్తున్నారు. సాయం అందించే క్రమంలో తాజాగా గాజాలో విషాదం చోటు చేసుకుంది.శుక్రవారం నాడు ఉత్తర గాజాలోని శరణార్థుల శిబిరం వద్దకు పారాచూట్ ద్వారా ఫుడ్ ప్యాకేజీని పంపించగా.. అది తెరుచుకోకపోగా ఆహారం కోసం వేచి చూస్తున్న ప్రజలపై పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. సుమారు 10 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆల్ షిఫా ఆస్పత్రికి తరలించినట్టు ఎమర్జెన్సీ రూమ్ హెడ్ నర్సు మహ్మద్ అల్-షేక్ వెల్లడించారు.