chandranna-pelli kanuka
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఆడపిల్లల కోసం చంద్రన్న కానుక..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు  యువతులకు తియ్యటి వార్త చెప్పారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. శుక్రవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి రాగానే ‘కలలకు రెక్కలు’ అనే పథకాన్ని చంద్రబాబు గారు ప్రారంభిస్తారని అన్నారు.

ఉన్నత చదువులవైపు వెళ్లాలని కోరిక ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని యువతుల కోసం ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు.
ఇంటర్ పూర్తయిన విద్యార్థులు పైచదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది. కోర్సు కాలానికి రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. kalalakurekkalu.com వెబ్ సైట్ ద్వారా అర్హులైన విద్యార్థులు నమోదు చేసుకోవాలి. మహిళలంటే సమాజంలో సగం జనాభా మాత్రమే కాదు, సమాజ శక్తిలో సగం. మహిళలను తోబుట్టువుల్లా చూసిన ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపి, ఆర్థిక స్వావలంబనకు తెలుగు దేశం నిరంతరం పని చేస్తోందన్నారు.  మహిళలను మహాశక్తులుగా మార్చేందుకే మహాశక్తి పథకాన్ని ప్రకటించారని, ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ 15,000 చొప్పున ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు రూ.1,500 సాయం, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేయనున్నట్లు దేవినేని ఉమా చెప్పుకొచ్చారు.