త్వరలో దేశంలో నిర్వహించే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం చారిత్రాత్మక అవసరమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గాదేపాక మధు కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విజన్ ను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉందన్నారు. కావున ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని ఎక్కువ లోక్ సభ స్థానాలు గెలిచే బాధ్యత తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, గృహహింస చట్టం, పోక్సో చట్టం, పేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.
ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండేందుకు, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించేందుకు సమాచార హక్కు చట్టం వచ్చిందన్నారు. కానీ నేటి పాలకులు ఆ చట్టాలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. భారతదేశంలో గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ప్రస్తుత పార్టీలు గుర్తించకపోవడం దారుణం అన్నారు. ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకుండా, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.