రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్రధాన పార్టీ తమ కార్యాకలాపాలను విస్తృతం చేస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా సభలు, సమావేశాలతో దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా జోరు పెంచింది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అనేక ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో భారీ సభ నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. విశాఖ వేదికగా రైల్వే గ్రౌండ్‌లో ఈ నెల 15న సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతోపాటు ముఖ్యమైన నేతలు హాజరుకానున్నారు. విశాఖ రైల్వే గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న సభను ప్రధానంగా విభజన సందర్భంగా పేర్కొన్న హామీల ప్రాతిపదికగా నిర్వహించబోతున్నారు.
ప్రత్యేక హోదాతోపాటు రైల్వే జోన్‌ను అంశాన్ని కేంద్రంగా చేసుకుని ఈ సభ నిర్వహణకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అదే సమయంలో తెలుగు ప్రజల పోరాట ఫలితంగా ఏర్పాటైన స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటీకరించేందుకు సిద్ధమవుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ 1100రోజులకుపైగా కార్మికులు, ఉద్యోగ సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గళం విప్పే అవకాశముందని చెబుతున్నారు. ప్రధానంగా సభకు హాజరయ్యే ముఖ్య నేతల ప్రసంగాలు స్టీల్‌ప్లాంట్ అంశంపైనే ఉంటాయని చెబుతున్నారు. సభకు కూడా సేవ్ విశాఖ.. సేవ్ స్టీల్‌ప్లాంట్ పేరును ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.రైల్వే మైదానంలో జరగనున్న సభకు సుమారు 50 వేల మంది ప్రజలను సమీకరించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్‌రెడ్డి ఉమ్మడి ఉత్తరాంధ్ర పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించారు.
ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం రెండు వేల మంది కార్యకర్తలను తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలంటూ నేతలకు సూచించారు. ఇప్పటికే మైదానంలో ఏర్పాట్లను ఆ పార్టీ నాయకులు జోరుగా సాగిస్తున్నారు. ఈ నెల 15న సాయంత్రం కాంగ్రస్ పార్టీ సభ ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఈ మేరకు విశాఖ జిల్లా పార్టీ నేతలతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మాట్లాడి ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నట్టు చెబుతున్నారు. శనివారం మధ్యాహ్నం కూడా ఆ పార్టీ ముఖ్య నేతలు సభ జరగనున్న మైదానానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సభతో కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో ఎన్నికల ఉత్సాహం వస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లోనూ రేవంత్‌రెడ్డితో మరిన్ని సభలు నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
తొలిసారి సీఎం హోదాలో ఒక బహిరంగ సభలో పాల్గొనేందుకు రేవంత్‌రెడ్డి ఏపీకి వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రసంగం ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై ఆయన ఎటువంటి విమర్శలు చేస్తారన్న దానిపైనా ఉత్కంఠ నెలకొంది