RTC employees
తెలంగాణ ముఖ్యాంశాలు

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 1 నుంచి కొత్త పీఆర్సీతో వేతనాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఈ నిర్ణయంతో 53,071 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుండగా.. ప్రభుత్వ ఖజానాపై రూ.418.11 కోట్ల అదనపు భారం పడనుందని మంత్రి పేర్కొన్నారు.ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వారికి మేలు చేకూర్చేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ‘2017లో అప్పటి ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందికి 16 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ఇచ్చింది. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వలేదు. సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ఉద్యోగుల సంక్షేమం కోసం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం. అందులో భాగంగానే 21 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ఇస్తున్నాం.

ఈ ఏడాది జూన్ 1 నుంచి నూతన పీఆర్సీతో వేతనాలు అమల్లోకి వస్తాయి. 2017 నుంచి 21 శాతం పీఆర్సీతో పే స్కేల్ అమలు చేస్తాం. అలాగే, ఎన్ని ఇబ్బందులున్నా మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాం.’ అని మంత్రి పేర్కొన్నారు.టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై పరిశీలిస్తున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. కొత్త రూట్లలో బస్సులు నడపాలనే డిమాండ్స్ దృష్ట్యా.. బస్సులు పెంచుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై కోపం ఉంటే వేరే పద్ధతిలో పోవాలని.. అంతే కాని సంస్థపై అనవసర విమర్శలు చెయ్యొద్దని హితవు పలికారు. గ్రామీణ ప్రాంతాల్లో రైల్వేల్లాగా ఆర్టీసీ బస్సులు పని చేస్తున్నాయని అన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తుంటే.. ప్రతిపక్షాలు ఆటోవాళ్లను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు