ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరిక
కరోనా థర్డ్ వేవ్‌పై తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పలు విషయాలను వెల్లడించారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే సెకండ్ వేవ్‌ను మించి ఉంటుందన్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ముగుస్తున్నందున ఆంక్షలను సడలిస్తున్నారని… కానీ ఆంక్షల సడలింపులో ఏమాత్రం తేడా వచ్చినా కేసులు పెరుగుతాయన్నారు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు, కేరళలో కేసులు పెరుగుతున్నాయని, ఆంక్షలు సడలించటం ద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. అదే జరిగితే థర్డ్ వేవ్ భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయని వివరించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుంటే మరణాల శాతాన్ని తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. అందుకే థర్డ్ వేవ్ రాకముందే ప్రజలందరూ టీకాలు తీసుకోవటం మంచిదని ఆయన సూచించారు.