TS-TG
తెలంగాణ ముఖ్యాంశాలు

టీస్ టీజీగా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్

వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ లపై తెలంగాణ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. రాష్ట్ర వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లను టీఎస్ నుండి టీజీ కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా.మల్లు రవి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.తెలంగాణలో ఏర్పాటైన ప్రభుత్వం TS పేరును TGగా మార్చాలని నిర్ణయించడం తెలిసిందే. గత కేబినెట్ భేటీలో తెలంగాణ స్టేట్ బదులుగా తెలంగాణ గవర్నమెంట్  అని మార్చాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో టీఎస్ అని ఉన్న వాహనాలు, ఇతర సంస్థల పేర్లు టీజీ అని మారుస్తారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఉన్న టీఎస్ నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని.. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకే నెంబర్ ప్లేట్లను ఇలా రిజిస్టర్ చేస్తారని సైతం ప్రచారం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగానే రాష్ట్ర రిజిస్ట్రేషన్ కోడ్‌ను TS నుంచి ‘TG’ మార్పు చేస్తూ కేంద్ర రవాణాశాఖ గెజిట్ నోటిఫికేషన్ మంగళవారం రాత్రి విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సైతం ఇదే తరహాలో మార్పులు జరిగాయి. అప్పటివరకూ ఉన్న ఏపీ రిజిస్ట్రేషన్లను యథావిధిగా కొనసాగిస్తామని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ నెంబర్ ప్లేట్స్ తోనే 30 లక్షల వాహనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వాహనదారులపై భారం పడకుండా రవాణాశాఖ ఆ విధంగా వ్యవహరించింది. తెలంగాణలో ఇప్పటికే 1.50 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 10 వేల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటివరకూ టీఎస్ పేరిట రిజిస్ట్రేషన్లు జరగగా.. ఇకనుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాల నెంబర్ ప్లేట్లపై ‘TG’గా మార్చనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ గైడ్ లైన్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ నినాదం అయిన TG  ఉండాలన్నది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.