కరోనా వ్యాక్సిన్ కనీసం ఒక డోసు తీసుకొని మళ్లీ ఇన్ఫెక్షన్ బారిన పడిన వాళ్లలో 80 శాతం మందికి డెల్టా వేరియంటే సోకినట్లు ఐసీఎంఆర్ తాజా అధ్యయనం తేల్చింది. వ్యాక్సినేషన్ తర్వాత ఇన్ఫెక్షన్‌లపై ఇలాంటి అధ్యయనం చేయడం ఇదే తొలిసారి. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకిన వాళ్లలో మరణాల రేటు చాలా తక్కువని కూడా ఈ అధ్యయనం తేల్చింది. 677 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీళ్లలో 71 మంది కొవాగ్జిన్, 604 మంది కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు ఉన్నారు. ఇద్దరు చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ముగ్గురు వైరస్ వల్ల చనిపోయారు.
ఇవీ అధ్యయనంలోని అంశాలు
- వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్లలో 86.09 శాతం మంది డెల్టా వేరియంట్ (బీ.1.617.2) వల్లే ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు.
- 9.8 శాతం మంది మాత్రమే హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. కేవలం 0.4 శాతం మంది చనిపోయారు.
- హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరంతోపాటు మరణాల రేటును వ్యాక్సినేషన్ గణనీయంగా తగ్గించినట్లు అధ్యయనంలో గుర్తించారు.
- ఇండియాలోని 17 రాష్ట్రాల నుంచి 677 మంది పార్టిసిపెంట్లపై అధ్యయనం నిర్వహించారు.
- వీళ్లలో 71 శాతం అంటే 482 మందికి ఒకటి లేదా రెండు లక్షణాలు కనిపించగా.. 29 శాతం మందికి అసలు లక్షణాలే లేవు.
- 69 శాతం మందికి జ్వరం రాగా.. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వికారం 56 శాతం మందిలో కనిపించింది.
- డెల్టా వేరియంట్ తర్వాత కప్పా వేరియంట్ వల్ల ఎక్కువ మంది వైరస్ బారిన పడ్డారు.