లోకసభ ఎన్నికల్లో పోటీ కోసం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పంపించారు. అదేవిధంగా పుదుచ్చేది లెఫ్ట్‌నెంటర్ గవర్నర్ పదవికి కూడా రాజీనామాను సమర్పించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె లోక్‌సభకు పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా ఎవరు రాబోతున్నారనే దానిపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది. ఎన్నికల కోడ్ వచ్చినందున కొత్తగా నియామకాలు జరిపే అవకాశం లేదని చెబుతున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం లో గవర్నర్ గా నరసింహన్ ఉండేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఉమ్మడి గవర్నర్ గా ఆయన ఐదేళ్ల పాటు ఉన్నారు. తర్వాత ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించారు. నరసింహన్ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయనను కొనసాగించలేదు. తమిళిశై సౌందరరాజన్ ను నియమించారు.
ఏపీకి మొదట ఒడిషాకు చెందిన బిశ్వభూషణ్‌ను.. తర్వాత హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయిన అబ్దుల్ నజీర్ కు గవర్నర్ గా పదవి లభించింది. ఇప్పుడు తెలంగాణకూ ఇంచార్జ్ గా ఏపీ గవర్నర్ వ్యవహరించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో తమిళిసై తమిళనాడు నుంచి పోటీ చేస్తారని సమాచారం. చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి నుంచి తమిళిసై లోక్ సభకు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం తమిళిసై చెన్నైకి వెళ్తారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి తమిళిశై గవర్నర్ గా వచ్చే ముందు బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2011 ఎన్నికల్లో వేళచ్చేరి నియోజకవర్గం నుంచి పోటీచేసి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తమిళిసైను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గవర్నర్‌గా పంపింది.
దూకుడైన నేతగా పేరున్న తమిళిశై గవర్నర్ పదవి విషయంలో ఇబ్బంది పడ్డారు. కేసీఆర్ సర్కార్ ఆమెకు ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి వివాదాలు రాలేదు. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలన్న లక్ష్యంతోనే కొంత కాలంగా ఆమె తన ప్రయత్నాలను చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ పరిస్థితి మెరుగుపడిందని.. ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నారు.