hyd
తెలంగాణ ముఖ్యాంశాలు

చిత్తడి చిత్తడిగా మారిన మహానగరం

నగరమా! నడిసంద్రమా! రెండు గంటల్లో హైదరాబాద్‌ సముద్రంలా మారింది. హఠాత్తుగా దంచి కొట్టిన వానతో భాగ్యనగరం చివురుటాకులా వణికిపోయింది. ఓవైపు ఎల్లో అలర్ట్‌ కొనసాగుతుండగా… నగరం నలుమూలలా రెండు గంటల పాటు కుంభవృష్టి కురిసింది. దీంతో ఇటు కూకట్‌పల్లి నుంచి అటు ఉప్పల్‌ వరకు వర్షం బీభత్సం సృష్టించింది. ఇక రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక జారీచేసింది వాతావరణ శాఖ. రెండే రెండు గంటల్లో భాగ్యనగర వీధులు మహాసంద్రాన్ని తలపించాయి. ఉరుములు మెరుపులతో రెండు గంటలపాటు కురిసిన కుంభవృష్టికి హైదరాబాద్‌ అతలాకుతలం అయ్యింది. రోడ్లు జలాశయాల్లా మారాయి.

హైదరాబాద్‌ నడిబొడ్డన ఉన్న సెక్రటేరియట్ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి.ఒకే ఒక్క గంటలో ఐదు సెంటీమీటర్ల జడివాన కురిసింది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఎటు చూస్తే అటు నీళ్ళు.. అడుగు తీసి అడుగువేయాలంటే హడలిపోయారు జనం. ఎక్కడ ఏ మ్యాన్‌ హోల్‌ ఉంటుందోనని గజగజ వణికి పోయారు. మియాపూర్‌, మూసాపేట్‌, కూకట్‌పల్లిలో 4 సెం.మీ వర్షం కురిసింది. తిరుమలగిరి, కేపీహెచ్‌బీ, జీడిమెట్లలో 3 సెం.మీవర్షం పటాన్‌చెరు, వెస్ట్‌ మారేడుపల్లి,

గాజులరామారం..కుత్బుల్లాపూర్‌, మల్కాజ్‌గిరిలో 3 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. ఇక బాలానగర్‌, ఖైరతాబాద్‌, చందానగర్‌, బోరబండ, ఆర్సీపురం, హఫీజ్‌పేటలో 2.5 సెం.మీ, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, కాప్రా…మల్కాజ్‌గిరిలో 2 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.భారీ వర్షంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కుండపోత వానతో వాహనదారులు నరకయాతన అనుభవించారు. హైటెక్ సిటీ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సైబరాబాద్ ట్రాఫిక్ DCP నగర ట్రాఫిక్‌ పరిస్థితిని పర్యవేక్షించారు. ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ నదుల్లా మారాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీచేశారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు DRF బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని గవర్నర్‌ తమిళిసై ట్వీట్‌ చేశారు. మలక్‌పేట్‌, సరూర్‌నగర్‌, మియాపూర్‌లలో 5 సెం.మీ.వర్షం పడింది. ఖైరతాబాద్‌, జీడిమెట్ల, రాజేంద్రనగర్‌, అంబర్‌పేట్‌, తిరుమలగిరిలలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.చందానగర్‌, సంతోష్‌ నగర్‌, కార్వాన్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, పటాన్‌చెరులలోనూ 4 సెం.మీ. వర్షం కురిసింది. మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై వరదనీరు పొంగిపొర్లుతోంది. మరోవైపు లంగర్‌ హౌస్‌ పై పిడుగు పడింది. ఇదిలా ఉంటే ఇప్పటికే హైదరాబాద్‌లో కొనసాగుతోంది ఎల్లో అలర్ట్‌. మరోవైపు రేపు హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటన చేసింది వాతావరణ శాఖ. మరో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు ఉండడంతో అధికారులు ఎలర్ట్‌ అయ్యారు. నగర వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు.  భారీ వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఐకియా జంక్షన్, హైటెక్ సిటీ, కేబుల్ బ్రిడ్జి పరిసరాల్లో భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షం కారణంగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో.. ట్రాఫిక్ డిసిపి రంగం లోకి దిగి క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ రూట్ కి ఆల్టర్నేటివ్ రూట్ లను చూశారు. వర్ష తీవ్రత పెరగడంతో ఏకంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర రంగంలోకి దిగి.. క్షేత్రస్థాయిలో అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు సిపి స్టీఫెన్ రవీంద్ర ఐక్య రోటరీ వద్ద చేరుకొని వర్షం లో తడుస్తూ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ సిపి ఆన్ రైన్ డ్యూటీ అన్నట్టు సిద్ధమయ్యారు. సైబరాబాద్ కమిషనర్ రైన్ డ్యూటీలో ఉండటంతో వాహనదారులు పోలీసుల తీరును ప్రశంసిస్తున్నారు.
కుతుబ్ మినార్ ధ్వంసం
లంగర్ హౌజ్ వద్ద కుతుబ్ షాహీ కాలం నాటి మసీదుపై  పిడుగు పడింది. దీంతో మినార్‌ చాలా వరకు దెబ్బతింది. భారీ వర్షం కురుస్తున్న టైంలో మసీదుపై పిడుగు పడిందని స్థానికులు చెప్పారు దీంతో మినార్‌ ధ్వంసమైంది. దాని శకలాలు విరిగి నేలపై పడ్డాయి. మసీదును పరిశీలించిన నిర్వాహక కమిటీ సభ్యులు యాంప్లిఫైయర్లు, వైరింగ్ వంటి విద్యుత్ ఉపకరణాలు చాలా వరకు పాడైపోయాయని గుర్తించారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ మసీదును సందర్శించి నిర్వహణ కమిటీ సభ్యులతో మాట్లాడారు. ఈ సమస్యను తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.జీహెచ్‌ఎంసీ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద గోడ కూలింది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్  బృందాలు అమీర్‌పేట సమీపంలోని దివ్య శక్తి అపార్ట్‌మెంట్‌లో సహాయకచర్యలు చేపట్టాయి. భారీ వర్షం కారణంగా రెండో అంతస్తులో ఉన్న ఫ్లాట్‌ గోడ కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బృందాలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని శిథిలాలను తొలగించాయి.

కుండపోత వర్షం హైదరాబాద్‌ వాసులకు చుక్కలు చూపించింది. సాయంత్రం చాలా మంది పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే టైంలో పడిన వర్షంతో నగర ప్రజలు నరకయాతన అనుభవించారు. ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎటు చూసిన వర్షపు నీరు, వాహనాల బారులు. హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసేసింది. అసలే సాయంత్రం ఐదు గంటలు దాటితే హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ అంతా ఇంతా కాదు. అలాంటిది ఆ టైంలో వర్షం పడితే ఏమైనా ఉంటుందా. సోమవారం కూడా అదే జరిగింది. ఏ రోడ్డులో చూసిన వాహనాల బారులే కనిపించాయి. ఓవైపు వర్షం ఇంకో వైపు ట్రాఫిక్‌, వారిని నియంత్రించడానికి పోలీసులకు కూడా చుక్కలు కనిపించాయి.  హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం కురిసిన వానతో నగరంలోని రోడ్డులు నదీ ప్రవాహాన్ని తలపించాయి. చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. అటు హైటెక్‌సిటీ నుంచి ఇటు నాగోల్‌, ఎల్బీనగర్‌, మొహదీపట్నం, మలక్‌పేట, ఇలా ఎటు చూసిన ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సాయంత్రం ఆరు గంటల నుంచి అర్థరాత్రి వరకు ఇదే పరిస్థితి కనిపించింది.  సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర నేరుగా రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేశారు.