1,117 బడులు.. రూ.230 కోట్లు
నందనవనాల్లా విద్యాలయాలు
ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
నాడు–నేడులో సంపూర్ణ అభివృద్ధి
ఏడాదిలో 25 వేలకు పైగా పెరిగిన విద్యార్థులు
నాడు.. వెలిసిపోయిన బ్లాక్‌బోర్డులు, విరిగిపోయిన బల్లలు, నేలవాలిన ప్రహరీలు, కూలడానికి సిద్ధంగా ఉన్న పైకప్పులు, శిథిల స్థితిలో భవనాలు, వినియోగానికి వీలులేని మరుగుదొడ్లు, పనిచేయని కుళాయిలు, ముంపునకు గురయ్యే ప్రాంగణాలు.
నేడు.. అధునాతన హంగులతో భవనాలు, పక్కాగా నిర్మించిన ప్రహరీలు, కార్పొరేట్‌కు ధీటుగా ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు, తరగతి గదిలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, విజ్ఞానపు బొమ్మలతో ఆసక్తి కలిగించే క్లాస్ రూమ్‌లు, డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ క్లబ్‌లు, ఆధునికీకరించిన మరుగుదొడ్లు, ఆహ్లాదం కలిగించే ప్రాంగణాలు, స్వచ్ఛమైన తాగునీటి వసతులు.. ఇది రెండేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో స్పష్టంగా కనిపించిన మార్పు
విద్యపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని నమ్మిన సీఎం జగన్ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. మనబడి నాడు–నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో కాన్వెంట్లను తలదన్నేలా తీర్చిదిద్దుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నాడు–నేడులో భాగంగా 1,117 బడుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.230 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకూ రూ.226.23 కోట్లను వెచ్చించి 98 శాతం పనులు పూర్తిచేశారు. ఏడాదిలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య 25 వేలకు పైగా పెరగడం ప్రభుత్వ కృషికి నిదర్శనం.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీలో విద్యారంగానికి ప్రాధాన్యమిస్తూ సీఎం జగన్ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అమ్మఒడి, విద్యాకానుక, వసతిదీవెన, విద్యాదీవెన, గోరుముద్ద వంటి పథకాలతో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నారు. ముఖ్యంగా మనబడి నాడు–నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ స్థాయిలో సదుపాయాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నారు. పాదయాత్ర సందర్భంగా శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను స్వయంగా చూసిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే వీటి ప్రక్షాళనకు ఆదేశాలు జారీ చేశారు. నాడు–నేడులో భాగంగా మూడు విడతలతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో మొదటి విడతలో చేపట్టిన పనులు 98 శాతం పూర్తయ్యాయి.
కార్పొరేట్ సవ్వడులు
నాడు–నేడులో భాగంగా పాఠశాలల భవనాలను ఆధునికీకరించారు. ప్రాంగణాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేలా మొక్కలు నాటారు. తరగతి గదుల్లో ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు ఏర్పాటుచేయడంతో పాటు గోడలను విజ్ఞానాన్ని అందించే బొమ్మలతో తీర్చిదిద్దారు. వీటితో పాటు డిజిటల్ తరగతి గదులు, ఇంగ్లిష్ ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లను ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకువచ్చారు. తాగునీటి కోసం కుళాయిలు ఏర్పాటుచేశారు. మొత్తంగా పాఠశాలలను నందవనంలా తీర్చిదిద్దారు.
మొదటి విడతలో రూ.230 కోట్లు
జిల్లాలో మొదటి విడత నాడు–నేడు పనులకు 1,117 పాఠశాలలను ఎంపిక చేసి రూ.230 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు సుమారు 98 శాతం పనులను రూ.226.23 కోట్లతో పూర్తిచేశారు. సమగ్ర శిక్ష అభియాన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు చేయిస్తున్నారు.
పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
నాడు–నేడు పనులతో పాఠశాలలు ఆహ్లాదంగా మారడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 3,280 ఉండగా 2019–20 విద్యాసంవత్సరంలో 2,85,315 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ సంఖ్య 2020–21 విద్యా సంవత్సరంలో 3,11,178కి చేరుకుంది. ఈ లెక్కన ఏడాదిలో 25,863 మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతేడాది కరోనా తొలిదశ సమయంలోనూ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపైనే తమ విశ్వాసాన్ని ప్రదర్శించారు.
నూతన జవసత్వాలు
మనబడి నాడు–నేడులో భాగంగా ప్రభుత్వ విద్యాలయాలను సమూలంగా మార్చి పేద పిల్లలకు కార్పొరేట్ విద్యావకాశాలు కల్పిస్తున్న సీఎం జగన్ చరిత్రకెక్కారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అరకొర వసతుల మధ్య ఆదరణ కోల్పోయిన సర్కారీ బడులకు ముఖ్యమంత్రి ఆలోచనలతో నూతన జవసత్వాలు వచ్చాయి. విద్యార్థులు ఇష్టపూర్వకంగా పాఠశాలలకు వచ్చే పరిస్థితులు నాడు–నేడు పనులతో సాధ్యమయ్యాయి.
–పువ్వుల ఆంజనేయులు, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
కార్పొరేట్‌ను తలదన్నేలా..
నాడు–నేడులో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. విద్యారంగ అభివృద్ధిపై సీఎం జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి నాడు–నేడు పనుల్లో కనిపిస్తోంది. ప్రతి పాఠశాల ఒక ఆలయంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇకపై పేదల విద్యార్థులు విద్యాకానుకలో భాగంగా అందించే యూనిఫాం, బూట్లు, టై, బెల్టు బ్యాగులతో దొరబాబుల్లా పాఠశాలలకు వస్తారు.
–ప్రసాద్ బైరీసెట్టి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి
రెండో విడతకు ప్రతిపాదనలు
జిల్లాలో మొదటి విడతలో 1,117 పాఠశాలల్లో నాడు–నేడులో భాగంగా చేపట్టిన పనుల్లో 98 శాతం పూర్తయ్యాయి. రెండో విడతలో మరో 1,101 పాఠశాలల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. తొలివిడతలో అభివృద్ధి చేసిన పాఠశాలలను వచ్చేనెల 15న సీఎం జగన్ విద్యార్థులకు అంకితం చేయనున్నారు. వచ్చేనెల 16వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. సరికొత్త హంగులతో విద్యార్థులకు స్వాగతం పలుకనున్నాయి.
–సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారి