ప్రయాణికులందరని సురక్షితంగా తీసుకువచ్చిన రెస్క్యూ టీం
రష్యాను వరుస విమాన ప్రమాదాలు వెంటాడుతున్నాయి. జూలై 6న 28 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం రాడార్ నుంచి అదృశ్యమై ఆ తర్వాత కూలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. సుమారు 13 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న విమానం అదృశ్యమయింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం గాలింపు చర్యలు మొదలు పెట్టింది. గంటల వ్యవధిలోనే విమానం ఆచుకీ గుర్తించింది. ప్రయాణికులందరిని కాపాడింది.
ఆ వివరాలు.. సైబీరియాలో ప్రాంతీయ విమానాలను నడిపే చిన్న విమానయాన సంస్థ సిలాకు చెందిన ఓ విమానం శుక్రవారం కేడ్రోవి పట్టణం నుంచి టాంస్క్ నగరానికి వెళ్తుండగా తప్పిపోయింది. విమానంలో 19 మంది ప్రయాణికులున్నారు. విమానం అదృశ్యం గురించి తెలియగానే అధికారులు హెలికాప్టర్లను రంగంలోకి దించి.. గాలింపు చర్యలు మొదలుపెట్టారు. గంటల వ్యవధిలోనే రెస్క్యూ హెలికాప్టర్లు విమానం ఆచూకీ కనిపెట్టాయి. ప్రమాద స్థలానికి చేరుకుని దానిలో ఉన్న ప్రయాణికులందరని సురక్షితంగా తీసుకువచ్చాయి.
పది రోజులజ క్రితం రష్యాలోని పెట్రోపావ్‌లోవిస్క్– కామ్‌చట్‌స్కై నగరం నుంచి పలానా నగరానికి 28 మందితో బయలుదేరిన విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్‌కు కొంత సమయం ముందు రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. విమానంతో కమ్యూనికేషన్ ఆగిపోయింది. అనంతరం విమానానికి సంబంధించిన శకలాన్ని ఒకోట్స్ సముద్ర తీరప్రాంతంలో కనుగొన్నారు. విమానంలోని వారెవరూ బతికి ఉండకపోవచ్చని రష్యా మీడియా పేర్కొంది. విమానం సముద్రంలోని రాతిబండలను గుద్దుకొని ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేశారు.