kavitha-ED
తెలంగాణ రాజకీయం

మూడో రోజు కవిత విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. తల్లిని మరి కొంతమంది కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని పిటిషన్ లో ఆమె విజ్ఞప్తి చేశారు. తల్లితో పాటు తన పిల్లలను, మరికొందరిని కలిసేందుకు అనుమతి కోరారు కవిత. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు. తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య.. సోదరీమణులు అఖిల సౌమ్య వినుత, సోదరుడు ప్రశాంత్ రెడ్డిలను కలుసుకునేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు కవిత. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తల్లి, కుమారులను కలిసేందుకు కవితకు అనుమతి ఇచ్చారు.ప్రస్తుతం మూడోరోజు ఈడీ కస్టడీలో కవిత ఉన్నారు. ఈడీ కస్టడీకి అనుమతించిన రోజు భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావు, కజిన్ బ్రదర్స్ పి శ్రీధర్, ప్రణీత్ కుమార్, పీఏ శరత్ చంద్రలను కలుసుకునేందుకు కవితను అనుమతి ఇచ్చింది న్యాయస్థానం.

కస్టడీలో ఉన్న 7 రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులు కవితను కలిసేందుకు పర్మిషన్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు.ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచారు. ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ ఎదుట కవిత తరపు న్యాయవాదులు, ఈడీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఈనెల 23వరకు ఈడీ కస్టడీ విధించారు. ఆరోజు మధ్యాహ్నం తిరిగి కవితను కోర్టులో హాజరుపర్చాలని అధికారులను కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఈడీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ లో కవితను అధికారులు ఉంచారు. ఆదివారం నుంచి సీసీటీవీల పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు.ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతీరోజూ సాయంత్రం 6గంటల నుంచి 7గంటల వరకు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలుసుకునే వెసులుబాటును కవితకు న్యాయస్థానం కల్పించింది.

కవిత కలుసుకునే వారిలో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, కుటుంబ సభ్యుల్లో హరీష్ రావు, ప్రణీత్ లతో పాటు న్యాయవాదుల బృందం పేర్లు న్యాయస్థానానికి కవిత తరపు న్యాయవాదులు అందజేశారు. దీంతో కవితను కలిసేందుకు హైదరాబాద్ నుంచి కేటీఆర్, హరీష్ రావుతో పాటు ప్రశాంత్ రెడ్డిలు ఢిల్లీ వెళ్లారు.మరోవైపు.. మంగళవారం విచారణకు రావాలని కవితకు సంబంధించిన పలువురిని పిలిచినట్లు ఈడీ అధికారులు శనివారం కోర్టుకు తెలిపారు. అదేవిధంగా.. కవిత నివాసంలో సోదాల సమయంలో ఐదు మొబైల్ ఫోన్లు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో ఒకటి కవిత, మరొకటి కవిత భర్త ఫోన్లుగా ఈడీ పేర్కొంది. మిగిలిన ఫోన్లు వాడుతున్న వారిలో కవిత వ్యక్తిగత సహాయకులు ఉన్నట్లు సమాచారం. వారందరినీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఈడీ పిలిచినట్లు సమాచారం.