president-droupadi
జాతీయం రాజకీయం

రాష్ట్రపతిపై సుప్రీంలో పిటీషన్

కేరళ ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీరుని నిరసిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్స్‌పై సంతకాలు పెట్టకుండా జాప్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. University Laws Amendment Billతో పాటు మొత్తం నాలుగు బిల్స్‌కి ఇటీవల అసెంబ్లీలో ఆమోదం లభించింది. వీటిని రాష్ట్రపతికి పంపింది ప్రభుత్వం. అయితే…ఏ కారణం చెప్పకుండా వాటిని రాష్ట్రపతి పక్కన పెట్టేశారని చెబుతోంది పినరయి సర్కార్. ఈ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెక్రటరీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పేర్లను ప్రస్తావించింది. గవర్నర్ కూడా తన వద్దే ఏడు బిల్స్‌ని పెట్టుకున్నారని, వాటినీ పక్కన పెట్టారని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఇందులో నాలుగు బిల్స్‌ని రాష్ట్రపతి పరిశీలనకు పంపించగా అవి కూడా పెండింగ్‌లో ఉండిపోయాయని వివరించింది. “అసెంబ్లీలో పాస్ అయిన బిల్స్‌ని పెండింగ్‌లో పెట్టడం గవర్నర్‌కి అలవాటైపోయింది. ఏ కారణం చెప్పకుండా నెలల పాటు పక్కన పెట్టేస్తున్నారు. ఇక రాష్ట్రపతి పరిశీలనకు పంపిన బిల్స్‌ పరిస్థితీ ఇదే.

ఎలాంటి కారణాలు చెప్పకుండా ఇలా చేయడం అంటే రాజ్యాంగంలోని అందరూ సమానమే అని చెప్పే సెక్షన్ 14ని ఉల్లంఘించడమే అవుతుంది. అంతే కాదు. రాజ్యాంగంలోని సెక్షన్ 21 ప్రకారం కేరళ రాష్ట్ర ప్రజల హక్కుల్నీ అవమానించినట్టే. వాళ్లకి అందాల్సిన సంక్షేమం అందకుండా చేస్తున్నారు”
– కేరళ ప్రభుత్వం పిటిషన్
ఇప్పుడే కాదు. గతంలోనూ గవర్నర్‌తో ప్రభుత్వానికి విభేదాలు వచ్చాయి. అసెంబ్లీలో పాస్ అయిన బిల్స్‌ని పెండింగ్‌లో ఉంచేస్తున్నారంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు గవర్నర్ ఆఫీస్‌కి నోటీసులు కూడా పంపింది. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.