అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి పవర్‌లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీ- కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ తుక్కుగూడ సభలోనే పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానుండటంతో పాటు.. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐసీసీ హైదరాబాద్‌లోని రిలీజ్ చేస్తుండటంతో టీ-కాంగ్రెస్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. పకడ్బందీగా ఏర్పాట్లు చేసి సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని కాంగ్రెస్ సిద్ధం అవుతోంది.ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లకు గాను 14 ఎంపీ సీట్లను గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది.
ఎన్నికలయ్యేంత వరకు ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా బాధ్యతలను పంచుకోవాలనీ, కార్యకర్తల వెన్నంటి ఉండాలని ఆ పార్టీ తెలంగాణ నేతలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయిన సీఎం రేవంత్ రెడ్డి గతంలో తమకు విజయం తెచ్చిపెట్టిన మల్కాజిగిరి ఎన్నికల మోడల్‌ను రాష్ట్రమంతటా అనుసరించా లని ఇప్పటికే పార్టీ ముఖ్యులకు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా ఒకట్రెండు రోజుల్లోనే అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పార్లమెంట్ , అసెంబ్లీ, బూత్ స్థాయిల్లో మూడంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కమిటీలో ఏఐసీసీ పరిశీలకులతో పాటు అక్కడి పార్టీ ముఖ్యులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి.
నియోజకవర్గ స్థాయి కమిటీలో ఎమ్మెల్యే లేదా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ, ప్రతి మండలం నుంచి ముఖ్య నేతలుంటారు.బూత్ స్థాయి కమిటీల్లో ఆ పరిధిలోని చురుకైన పార్టీ సభ్యులు ఐదుగురికి అవకాశం కల్పిస్తారు. బూత్ కమిటీలో ఉండే ఐదుగురే ఈ సారి ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఎన్నికలకు వీరే సైనికులుగా నిలబడతారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థికి ఆ బూత్‌లో వచ్చిన ఓట్ల సంఖ్య బూత్ కమిటీ సభ్యుల పని తీరుకు ప్రాతిపదికగా ఉంటుందని అన్నారు.బూత్ కమిటీల్లో ఉన్న సభ్యులకు భవిష్యత్తులో తగిన గుర్తింపునిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య నేతలతో ఈ సందర్భంగా చెప్పారు. పనితీరును బట్టి త్వరలో నియమించే ఇందిరమ్మ కమిటీల్లో వారికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.