- గునీటిపై అన్యాయాన్ని సహించేది లేదు
- రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు
- విభజన హామీలు సాధించే వ్యూహం ఉండాలి
- పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా కొట్లాడండి
- టీఆర్‌ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం
తెలంగాణకు న్యాయంగా రావాల్సిన సాగు, తాగు నీళ్లపై కేంద్రప్రభుత్వాన్ని నిలదీయాలని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ పార్లమెంట్ సభ్యులకు పిలుపునిచ్చారు. రాష్ట్రప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడొద్దని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తావించాల్సిన తెలంగాణ అంశాలు, సమస్యలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. అంతకుముందు కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ గెజిట్ల న్యాయపరమైన అంశాలపై అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌తో చర్చించారు. ఇదే విషయంలో సాగునీటిరంగ నిపుణులతో సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. అనంతరం ఎంపీలతో సమావేశంలో ఈ అంశంపైనే చర్చించారు. సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ర్టానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరుగనివ్వకూడదని స్పష్టంచేశారు.
పార్లమెంట్ ఉభయసభల్లో సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా కోసం నిలదీయాలని, గట్టిగా కొట్లాడాలని సూచించారు. కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లులను సంపూర్ణంగా అధ్యయనం చేసి సభలో మాట్లాడాలని, అవసరమైతే ఎప్పటికప్పుడు సూచనలు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను సాధించుకొనేందుకు కేంద్రాన్ని ప్రశ్నించాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ సహా అన్ని హామీలపై సంబంధిత కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలును అందజేయాలని ఆదేశించారు. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కారానికి సంబంధిత కేంద్ర మంత్రిని కలవాలని పేర్కొన్నారు.
సమావేశాల్లో హుందాగా ఉంటూనే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేయాలని తెలిపారు. సమావేశంలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సంతోష్‌కుమార్, కేఆర్ సురేశ్‌రెడ్డి, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్‌సభ సభ్యులు బీబీ పాటిల్, పోతుగంటి రాములు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, బీ వెంకటేశ్ నేతకాని, మన్నె శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.