బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ హైదరాబాద్ మార్చ్ 28 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతి పరులను జైల్లో వేస్తామని మాటలకే పరిమితం అయ్యాడు తప్ప చర్యలు లేవని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. రేవంత్ రెడ్డి లీక్ వీరుడు కాదు.. గ్రీక్ వీరుడు అని నిరూపించుకోవాలనుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ట్యాపింగ్ వ్యవహారంలో పాత్రదారులతో పాటు సూత్రదారులను కూడా బయట పెట్టాలన్నారు. కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు.. పోన్ ట్యాపింగ్ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కూడా కేసీఆర్ ప్రభుత్వం పాల్పడింది. తెలంగాణ సంపదను దోచుకున్న వారికి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అయినా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అవినీతి పరులపై చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి అవకతవకలపై చర్యలు లేవు.. డ్రగ్స్ కేసులు పత్తా లేవని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ దుర్మార్గాలను, అవినీతిపై నిప్పులు చెరిగారు. నియంతృత్వంగా వ్యవహరించేవాళ్లు నీడను కూడా నమ్మరని.. కేసీఆర్ కూడా ఎవరినీ నమ్మలేదని.. అందుకే రాజకీయ, మీడియా ప్రముఖులు, పలువురు బ్యూరోక్రాట్ల ఫోన్లు ట్యాపింగ్, వ్యాపారులను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడితే.. సందట్లో సడేమియా అన్నట్టుగా అధికారులు సర్దుకున్నారని దుయ్యబట్టారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్ నుంచి కదలలేదు.. సచివాలయానికి వెళ్లలేదు.. గత ప్రభుత్వంలో ప్రతి స్కీంను స్కామ్‌లు గా మార్చేశారు. కమీషన్లు దండుకున్నారు.. ప్రశ్నించే వారిని బెదిరింపులకు గురి చేశారు.. నియంతృత్వ పోకడలు సాగించారు.. కక్ష సాధింపులో భాగంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు, వ్యాపారస్తులు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని లక్ష్మణ్ మండిపడ్డారు. అసెంబ్లీ, ఉప ఎన్నికల సమయంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిచారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో కొంత మంది పోలీసు అధికారులు ఏ రకంగా అక్రమార్జనకు పాల్పడ్డారో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించింది. ఇది తీవ్రమైన నేరంగా ఆయన పరిగణించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరపకుండా వెనకేసుకొస్తోందంటూ లక్ష్మణ్ మండిపడ్డారు.
డ్రగ్స్ ఇష్యూ, మియాపూర్ భూ కుంభకోణం, ధరణితో అక్రమాలు.. కొత్తగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి వచ్చిందన్నారు. పోలీసులేమో నేతలు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశామని అంటున్నారు.. కేటీఆర్ ఒక్కరిద్దరి ఫోన్లు ట్యాప్ అయ్యి ఉండొచ్చని మాట్లాడుతున్నారు.. మరి పోలీస్ లు చట్టాన్ని అతిక్రమిస్తే కేటీఆర్ మీ ప్రభుత్వం గుడ్డి గాడిద పల్లు తోమారా? అని ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా … కేవలం ఎన్నికల వేల ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇటువంటివి తెరమీదకి తెస్తున్నారనే అనుమానం కలుగుతోందని తెలిపారు. ఇప్పటికైనా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.